Read more!

టీడీపీలోకి దాడి వీరభద్రరావు?

 

 

 

టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన విశాఖకు చెందిన తెలుగుదేశం నాయకుడు దాడి వీరభద్రరావు ఇప్పుడు జగన్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వైసీపీలోంచి బయటకి వచ్చేశారు. ఇప్పుడాయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాడి వీరభద్రరావు అలా వైసీపీని వీడారో లేదో ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు దాడికి ఆహ్వానం పలికారు. ఎన్టీఆర్‌కి పరమ భక్తుడైన దాడి తెలుగుదేశం పార్టీలోకి వస్తే సాదరంగా స్వాగతం పలుకుతామని అన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం రావడం దాడికి సంతోషాన్ని కలిగించినట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.

 

ఇదిలా వుంటే వైసీపీని వీడిన తర్వాత దాడి వీరభద్రరావు జగన్ మీద మాటల దాడి చేశారు. జైల్లో వున్నప్పుడు జగన్ వేరని, జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత మరోలా వున్నారని దాడి చెప్పారు. జగన్ ఎన్నికల వరకు జైలులోనే వుంటే గెలిచేవారని, ఆయన జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం చూసిన జనం అమ్మో జగన్ అని భయపడే స్థితికి చేరుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు.


జగన్ ఎవరినీ నమ్మరని, చివరికి తల్లిని, చెల్లిని కూడా నమ్మరని ఆయన విమర్శించారు. తనకంటే తన చెల్లి షర్మిల ఎదిగిపోతుందని భయపడిన జగన్ ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించేశారని తెలిపారు. తన తల్లిని విశాఖపట్నం నుంచి పోటీ చేయించి, కనీసం ఆమెను గెలిపించుకునే ప్రయత్నం కూడా జగన్ చేయలేదని దాడి అన్నారు. విజయమ్మ ఓటమికి జగనే కారణమని ఆరోపించారు. భవిష్యత్తులో పార్టీని నడిపే శక్తి స్థాయి జగన్‌కు లేవన్నారు. రైతు రుణాల మాఫీ ప్రకటించవయ్యా మగడా అని ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదన్నారు. భవిష్యత్తులో వైసీపీ మనుగడ కష్టమే అన్నారు.