Read more!

అఖిలేష్ సర్కార్‌కి రాష్ట్రపతి పాలన గండం?

 

 

 

ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా వున్న ప్రభుత్వం త్వరలో కూలిపోయే అవకాశం వుందని, త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల అంశాన్ని ప్రధానంగా తీసుకుని కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

గత కొంతకాలంగా ఉత్తర ప్రదేశ్‌లో అత్యాచారాలు, హత్యలు మామూలైపోయాయి. కొద్ది రోజుల క్రితం ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మీద  కొంతమంది దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. రెండు మూడు రోజులకోసారి మహిళల అత్యాచారం, హత్యలు మామూలైపోయాయి. వీటిని అరికట్టాల్సిన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అత్యాచారానికి గురైన వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు వున్నాయన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.


ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన  విధించడంతోపాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని 80 ఎంపీ స్థానాలలో ఎన్డీయే కూటమి 78 స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి యు.పి.లో ఎలాంటి చర్యలు చేపట్టినా మోడీ ప్రభుత్వానికి ఎదురు వుండే అవకాశం లేదు. ఉత్తర ప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రంగా ఉన్నందున పరిపాలనా సౌలభ్యం చాలా తక్కువగా వుందన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. మాజీ ముఖ్యమంత్రి మాయావతి అయితే ఉత్తర ప్రదేశ్‌ని ఏకంగా 5 రాష్ట్రాలుగా విభజించాలని గతంలో యు.పి. అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పాస్ చేయించారు. ఇప్పుడు యుపిని మూడు రాష్ట్రాలుగా విభజించడం పరిపాలన పరంగా మేలు జరగడమే కాకుండా, యు.పి.లో అరాచకాలను సమర్థంగా నియంత్రించవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.