గురజాడ గృహం ఆధునీకరణకు పవన్ చర్యలు
posted on Sep 21, 2025 @ 7:24PM
విద్యలనగరం సమున్నత కీర్తి శిఖరం గురజాడ వేంకట అప్పారావు గృహం స్థితిగతులపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. కన్యాశుల్కం వంటి కీర్తిశేషం పుట్టిన ఆ ఇంటి గోడలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గురజాడ వారసులు ప్రసాద్, ఇందిర… తమ సొంత నిధులతో గోడలపై మట్టిని పూస్తూ, పైకప్పు వర్షం తడవకుండా కాపాడుతూ ఎంతకాలం లాగగలిగారో అంతవరకే సాగించారు. సహాయం కోసం కార్యాలయాల గడప తట్టినా, ఫలితం పెద్దగా రాలేదు. చివరికి పోస్టు కార్డు ఉద్యమం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఒక చొరబాటు సంఘటన ఆ ఇంటి అస్థిరతను మరింత రేగదీసింది.
అదే సమయంలో ఓ ప్రముఖ దిన పత్రికలో వచ్చిన న్యూస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంటపడింది. వెంటనే ఆయన స్పందించి గురజాడ ఇంటిని పూర్తిగా పునరుద్ధరిస్తాం, రచనలను డిజిటలైజ్ చేస్తాం, సమీపంలో ఆడిటోరియం కడతాం” అని హామీ ఇచ్చారు. విజయనగరంలో ఇప్పటికే సింహాచలం మేడ, మహారాజా ఆస్పత్రి, సంగీత కళాశాల వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు కాలం వలలో కనుమరుగయ్యాయి. గురజాడ గృహం కూడా అదే మార్గంలో పోవచ్చనే భయం అందరిలో ఉంది.
కానీ ఈసారి ఒక ఆశాకిరణం కనిపించింది. పవన్ కళ్యాణ్ మాటలకు కార్యరూపం వస్తే గురజాడ అప్పారావు స్మృతి, ఆయన స్ఫూర్తి మరింత బలపడతాయి. విజయనగరం ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులందరూ ఊపిరి పీల్చుకుంటారు. పైడితల్లి జాతర నాటికి ఆ గృహం పూర్వ వైభవం తిరిగి తెచ్చి నిలబెట్టే రోజును అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రాగానే, గురజాడ ఇంటి చరిత్ర కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది.