వన్ నేషన్...వన్ ట్యాక్స్ కల సాకరం : ప్రధాని
posted on Sep 21, 2025 @ 7:37PM
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. నవరాత్రుల తొలి రోజైన సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభమవుతుందని ప్రధాని తెలిపారు . కొత్తగా అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలతో వస్తువుల ధరలు గణనీయంగా తగ్గి, ప్రజలకు ఇది “పొదుపు పండగ” అవుతుందని మోదీ వివరించారు. దేశ ఆర్థిక చరిత్రలో కొత్త అధ్యాయానికి ఇదే నాంది అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
కొత్త జీఎస్టీ రేట్లతో ప్రజలు తమకు ఇష్టమైన వస్తువులను మరింత చవక ధరల్లో సులభంగా కొనుగోలు చేయగలరని ప్రధాని తెలిపారు. “ఇది ప్రతి భారతీయుడికి జీఎస్టీ పొదుపు పండగలాంటిది” అని ఆయన అన్నారు. పన్ను తగ్గింపు ముఖ్యంగా పేదలు, నూతన మధ్యతరగతి వర్గాలకు రెండింతల ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ వెల్లడించారు. ఈ సంస్కరణలు రైతులు, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు), మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా మేలు చేస్తాయని ఆయన వివరించారు.
“జీఎస్టీ 2.0” పేరుతో ప్రవేశపెట్టిన ఈ విధానంలో పన్ను నిర్మాణాన్ని సులభతరం చేశారు. ఇకపై 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉండగా, అత్యంత విలాసవంతమైన లేదా హానికరమైన వస్తువులపై అదనంగా 40% పన్ను విధించనున్నారు. సెప్టెంబర్ 4న ప్రకటించిన ఈ తగ్గింపులు, 2017 జూలైలో జీఎస్టీ అమలు తర్వాత పరోక్ష పన్నుల వ్యవస్థలో జరిగిన అతిపెద్ద సంస్కరణలుగా నిలిచాయి.
కేంద్రం–రాష్ట్రాల సంపూర్ణ ఏకాభిప్రాయంతో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. ఈ సంస్కరణలు సహకార స్ఫూర్తికి నిదర్శనమని, వస్తువులు చౌక కావడంతో పాటు పరిశ్రమలకు ఉత్సాహం లభించి, భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.