Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు సర్వం సిద్దం
posted on: Sep 21, 2025 4:31PM

తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మహాలయ అమావాస్య సందర్భంగా నేటి (ఆదివారం) నుంచి పల్లెపల్లెల్లో, పట్టణాలన్నిట్లో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటల సందడి నెలకొననుంది. సకల వర్గాల ప్రజలు ఏకతాస్ఫూర్తిని చాటుకుంటూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలు తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పాటలతో, ఆటలతో రాష్ట్రం పండుగ మూడ్‌లో తేలనుంది.
హైదరాబాద్‌లో బతుకమ్మ ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నగర వ్యాప్తంగా 384కి పైగా బతుకమ్మ కుంటలు, చెరువులు, తాత్కాలిక కుంటలు, ట్యాంకులు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం కోసం 82 తాత్కాలిక మరుగుదొడ్లు, 45 వేల లైట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. వేడుకల ప్రాంగణాల్లో 1,450 శానిటేషన్ సిబ్బంది పనిచేయనున్నారని చెప్పారు. పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, ఎల్‌బి స్టేడియం, జలవిహార్, కాప్రా చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, సరూర్‌నగర్ చెరువు, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, సేరిలింగంపల్లి తదితర ప్రాంతాలు ప్రధాన వేదికలుగా సిద్ధం చేశామని అధికారులు స్పష్టం చేశారు.
చెరువుల వద్ద శుభ్రత, దోమల నివారణ స్ప్రేలు, భద్రతా చర్యలతో పాటు మహిళా సంఘాలు, వాలంటీర్లు, స్థానిక సంఘాల సహకారంతో ఈసారి బతుకమ్మ వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.మరో వైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్దిపేట జిల్లా చింతమడకకు చేరుకున్నారు. ఆమెకు స్థానిక మహిళలు, జాగృతి నేతలు ఘన స్వాగతం పలికారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో కవిత పాల్గొననున్నారు






