గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతి, ఢిల్లీలో టెన్షన్ టెన్షన్
posted on Dec 29, 2012 @ 10:49AM
ఈ నెల 16న ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కు గురి అయిన పారా మెడికల్ విద్యార్ధి ఈ ఉదయం 2.15 గంటల సమయంలో సింగపూర్ ఆసుపత్రిలో మరణించడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 23 సంవత్సరాల ఆ యువతి మృతి వార్త ప్రపంచానికి తెలియడంతో ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
ఆందోళనలు జరిగే అవకాశం ఉన్న ఇండియా గేట్, విజయ్ చౌక్ వంటి ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా నిషేదాజ్ఞలు విధించి భద్రతను మరింత పెంచారు. 10 జనపథ్ వంటి ప్రముఖుల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళనలను నియంత్రించే చర్యల్లో భాగంగా అనేక మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. భాదితురాలి మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తమ సంతాపాలను ప్రకటించారు.
మరణించిన యువతి విదేశీయురాలు కావడంతో తగిన లాంచనాలను పూర్తి చేయడానికి ఇప్పటికే ఆ మృత దేహాన్ని సింగపూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆ యువతి మృత దేహాన్ని ప్రత్యెక విమానంలో ఈ రోజు సాయంత్రానికి భారత్ తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ నుండి నేరుగా ఉత్తర ప్రదేశ్ బలియా జిల్లాలోని ఆమె స్వస్థలానికి తీసుకువెళ్తారు.
మరణించిన తమ కుమార్తెకు ప్రభుత్వం కల్పించిన వైద్య సదుపాయాలఫై ఆమె తల్లితండ్రులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సింగపూర్ లోని భారత హై కమీషనర్ టిసిఏ రాఘవన్ ప్రకటించారు. మృత దేహాన్ని భారత్ కు తీసుకువెళ్ళాలని కూడా వారు కోరారని ఆయన అన్నారు. యువతి మృతితో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిఫై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
ఇక దారుణంగా దేశ రాజధానిలోనే రేప్ కు గురి అయ్యి, దాదాపు రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఈ ఉదయం తనువు చాలించిన ఆ యువతి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎలాంటి నష్ట పరిహారాన్ని అందిస్తుందో మాత్రం వేచి చూడాలి.
ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, ఆ యువతి మృతికి తెలుగు వన్. కామ్ ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తోంది.