ముస్తఫాది ధిక్కార‌మా? వైసిపి ఎత్తుగ‌డ‌న‌! 

రాజ‌కీయాలు  ముఖ్యం కాదు! ఎంత‌టికైనా తెగిస్తానంటున్న వైసిపి ఎమ్మెల్యే ముస్త‌ఫా!

జ‌రిగిందేదో జ‌రిగిపోయింది. వైసిపి ఎంపీలు సి.ఎ.ఎ.కు అనుకూలంగా పార్ల‌మెంట్‌లో ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారి దృష్టికి ముస్లింల మ‌నోభావాల‌ను తీసుకు వెళ్తాను. త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని కోర‌తాను. అలా చేయకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఎంతటికైనా తెగిస్తాను. నాకు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ముఖ్యమంటున్నారు ఎమ్మెల్యే ముస్త‌ఫా. ఎమ్మెల్యే ముస్త‌ఫా నిజంగానే రెచ్చిపోయారా? లేక వైసిపి పార్టీ ఎత్తుగ‌డ‌నా అనే అంశంపై రాష్ట్ర రాజ‌ధానిలో ఉత్కంఠ‌త నెల‌కొంది.

భారత్‌లో నివసించే ముస్లింల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఎమ్మెల్యే ముస్త‌ఫా ఆరోపించారు. మతాల వారీగా ప్రజలను విడగొట్టే ఇలాంటి చట్టాలను  రాష్ట్రం లో అమలు చేయ‌కుండా ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్తాన‌ని ఆయ‌న అన్నారు.   ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివాదాస్పద చట్టాలను రాష్ట్రంలో అమలు చేయరని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ విషయంలో తనకు త‌మ నాయ‌కుడిపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని  ఆయ‌న చెప్పారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయ‌న తెలుగుఒన్ తో త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. 

పౌరసత్వ సవరణ చట్టం జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాలకు  రాష్ట్రంలోని ముస్లింలు సైతం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. కాబ‌ట్టి ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా ఒప్పుకుంటార‌నే న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌నే కాదు గతంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కూడా ఇవే వ్యాఖ్యలు చేశారని ఆయ‌న గుర్తుచేశారు.

Teluguone gnews banner