డిల్లీలో మళ్ళీ హంగ్ అసెంబ్లీ?
posted on Jan 19, 2015 @ 10:10AM
వచ్చే నెల ఏడున డిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. అవకాశం దక్కితే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని ఏకంగా దేశాన్నే ఏలేద్దామనుకొన్న రాహుల్ గాంధీ, కనీసం ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ని కూడా సమర్ధంగా డ్డీకొనలేకపోవడంతో డిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభావం బొత్తిగా కనబడటంలేదు. కనుక ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా బీజేపీ-ఆమాద్మీ పార్టీల మధ్యనే సాగబోతున్నట్లు స్పష్టమయింది.
మొన్న డిశంబర్ నెలలో వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలలో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని పేర్కొంటే, క్రిందటి వారం నిర్వహించిన తాజా సర్వేలో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత రాబోదని, మళ్ళీ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నట్లు తేలింది. డిల్లీ అసెంబ్లీకున్న 70 సీట్లలో బీజేపీకి-34 ,ఆమాద్మీ-28, కాంగ్రెస్-8 సీట్లు గెలుచుకోవచ్చని తేలింది. ఈసారి ఎన్నికలలో బీజేపీ-ఆమాద్మీ పార్టీల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉన్నందున, స్వతంత్ర అభ్యర్ధులు ఎవరూ గెలిచే అవకాశం లేదని సర్వేలో తేలింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 36 సీట్లు తప్పనిసరి. అందువల్ల బీజేపీకి మరో రెండు సీట్లు అవసరం పడుతాయి. కానీ ఈసారి స్వతంత్ర అభ్యర్ధులు ఎవరూ గెలిచే అవకాశం లేదని తేలింది కనుక బీజేపీకి ఒక్క సీటు తగ్గినా కూడా అధికారంలోకి రాలేదు.
ఈ సమస్య నుండి గట్టెక్కెందుకే బీజేపీ ఎవరూ ఊహించని విధంగా మాజీ ఐ.పి.యస్.అధికారిణి కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకొంది. రేపు డిల్లీలో జరుగబోయే పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆమెను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉంది. మంచి క్రమశిక్షణ, నీతి నిజాయితీ గల సమర్దురాలయిన పోలీస్ ఆఫీసర్ గా పేరొందిన కిరణ్ బేడీని ఏవిధంగా కూడా ఆమాద్మీ పార్టీ విమర్శించలేదు. ఆమెను విమర్శిస్తే ఆమాద్మీ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండాపోయే ప్రమాదం ఉంది. అలాగని ఆమెను విమర్శించకుండా ఊరుకొంటే ఆమె తమ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అప్రయోజకత్వాన్ని ప్రజలలో ఎండగడుతుంటే పార్టీకి ఇంకా నష్టం కలిగే ప్రమాదం ఉంది. కనుక ఆమాద్మీ నేతలు చాలా తెలివిగా ఆమెపై ఎదురు దాడి చేస్తున్నారు. అన్నా హజారేతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆమె ఎడ్యూరప్ప వంటి అవినీతిపరులతో నిండిన బీజేపీలో చేరడాన్ని ఏవిధంగా సమర్ధించుకొంటారు? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఎన్నికలలో బీజేపీ పట్టణప్రాంతాలలో పూర్తి ఆధిక్యత కనబరుస్తుండటంతో ఆమాద్మీ పార్టీ డిల్లీ శివారు ప్రాంతాలపై తన దృష్టి కేంద్రీకరిస్తోంది. అక్కడ నివసిస్తున్న గుజ్జర్లు, జాట్లు అనే రెండు ప్రధాన వర్గాల ప్రజలను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రెండు వర్గాల జనాబా కలిపి దాదాపు 17 శాతం వరకు ఉంటారు. ఇంతకు ముందు కాంగ్రెస్ వైపున్న వారందరూ తరువాత బీజేపీ వైపు మళ్ళారు. కానీ బీజేపీ కూడా వారిని పెద్దగా పట్టించుకోకపోవడంతో వారిని తన వైపు త్రిప్పుకొనేందుకు ఆమాద్మీ పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఆమాద్మీ పార్టీ వారిని తనవైపు తిప్పుకోవడంలో సఫలమయినట్లయితే ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత లభించకపోవచ్చును. అప్పుడు డిల్లీలో మళ్ళీ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. బహుశః అందుకే ఆ రెండు పార్టీలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకొన్నాయి. డిల్లీ ప్రజలు సుస్థిరమయిన పరిపాలన కోరుకొంటున్నట్లయితే అందరూ తమ పార్టీకే ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ ప్రజలు ఎటువైపు మొగ్గుతారో ఆఖరి నిమిషం వరకు ఎవరూ ఊహించలేరు.