ఏపీలో కాంగ్రెస్ చీటీ చిరిగిపోయినట్టేనా?
posted on Jan 17, 2015 @ 8:06PM
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నలబై మంది సభ్యులతో ఈరోజు పార్టీకి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసారు. మొత్తం 13 మంది ఉపాధ్యక్షులు, 26 మంది ప్రధాన కార్యదర్శులు, 13 జిల్లాలకు అధ్యక్షులను, 13 మంది నగర అధ్యక్షులను నియమించారు. త్వరలోనే ఆర్గనైజింగ్ సెక్రెటరీలు, కార్యదర్శులను, కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులను కూడా నియమిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన తన బాధ్యత చాలా చక్కగానే నెరవేర్చారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్ ఉందా? అని ఆలోచిస్తే ఇదంతా వృధా ప్రయాసేననిపిస్తుంది.
రాష్ట్ర విభజన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న నిర్ణయం వలన హేమాహేమీలనదగ్గ అనేకమంది కాంగ్రెస్ నేతలు రాజకీయ సన్యాసం తీసుకోవలసి వచ్చింది. మిగిలినవారిలో చాలా మంది ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయారు. మరి కొంత మంది మూటాముల్లె సర్దుకొని గోడ మీద కూర్చొని ఉన్నారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ గురి కాంగ్రెస్ మీదనే ఉందనే సంగతి రఘువీరా రెడ్డికి తెలియకపోదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డిల్లీకి తిరిగి వెళ్లిపోతూ వచ్చే ఎన్నికల నాటికి కనీసం 70 మంది బలమయిన నేతలను సంపాదించుకోవాలని ఒక టార్గెట్ కూడా పెట్టారు. అంటే ఆ డబ్బై మందిలో కనీసం ముప్పావు వంతు మంది కాంగ్రెస్, వైకాపాల నేతలేనని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బహుశః ఆ భయంతోనే రఘువీర రెడ్డి ఈ పదవుల పందేరం పెట్టుకోన్నారేమో కూడా.
కానీ 67 మంది యం.యల్యే.లున్న వైకాపాయే తన భవిష్యత్ ఏమిటో తెలియక తికమక పడుతుంటే కనీసం ఒక్క యం.యల్యే. కానీ యంపీగానీ చివరికి ఒక బలమయిన నేత గానీ లేని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ గురించి రఘువీరా రెడ్డి ఆలోచించడాన్ని మెచ్చుకోక తప్పదు. కానీ ఐదేళ్ళ తరువాత కూడా పోటీ ప్రధానంగా తెదేపా, వైకాపా ఒకవేళ బీజేపీ అప్పటికి బలపడి వేరేగా పోటీ చేయదలిస్తే వాటి మధ్యనే ఉండవచ్చు తప్ప కాంగ్రెస్ ఏవిధంగానూ పోటీలో నిలబడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందువలన అంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనప్పుడు రాష్ట్రాలలో కూడా కష్టమే అవుతుంది.
నరేంద్ర మోడీ తమ పార్టీ అధికారంలో లేనప్పుడే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి తన నాయకత్వ లక్షణాలను, సత్తాను చాటుకొన్నారు. అటువంటప్పుడు ఈ ఐదేళ్ళలో ఆయన మరింత బలపడిన తరువాత ఆయనని ఓడించడం రాహుల్ గాంధీవల్ల అయ్యే పని కాదు. జాతీయ స్థాయిలో పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం రాష్ట్ర స్థాయి పార్టీ మీద కూడా బలంగా ఉంటుంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మరో పది పదిహేనేళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. అంతవరకు కాంగ్రెస్ పార్టీ బ్రతికిఉంచేందుకయినా ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం మంచి ఆలోచనే.