తెలంగాణా ప్రభుత్వ మైండ్ సెట్ మారదా?
posted on Jan 20, 2015 9:10AM
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఉభయ రాష్ట్రాలలో ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాలకు ప్రస్తుతం అమలులో ఉన్న విధివిధానాలనే మరో పదేళ్ళ వరకు యదాతధంగా కొనసాగించాలని విస్పష్టంగా పేర్కొనబడింది. కానీ తెలంగాణా ప్రభుత్వం దానిని బేఖాతరు చేస్తూ ఎంసెట్, లాసెట్, ఐ సెట్, ఈ సెట్ వంటి వివిధ కోర్సులలో ప్రవేశాలకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణాలో ఉన్నత విద్యలు చదవదలచుకొన్న విద్యార్ధులు తప్పనిసరిగా తెలంగాణా ఉన్నత విద్యా మండలి నిర్వహించే ప్రవేశ పరీక్షలు వ్రాయవలసి ఉంటుందని, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్లయితే ఆ రాష్ట్రంలో కూడా తామే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజ్ రీఇంబర్స్ మెంట్ చేస్తామంటూ తెలంగాణా ప్రభుత్వం హడావుడిగా ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పధకాన్ని హైకోర్టు తప్పు పట్టడమే, తెలంగాణా ప్రభుత్వం భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం విభజన చట్టాన్ని బేఖాతరు చేస్తూ వేరేగా ప్రవేశపరీక్షలు పెట్టుకోదలిస్తే మళ్ళీ అందుకు కోర్టులో మొట్టికాయలు తినక తప్పదు. తెలంగాణా ప్రభుత్వం కలిసి రావడం లేదు కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వెళితే కోర్టుకయినా వెళ్ళాలి లేదా తను కూడా వేరేగా ప్రవేశపరీక్షలయినా నిర్వహించుకోవలసి ఉంటుంది. కానీ వేరేగా పరీక్షలు నిర్వహించుకోవడం అంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కనుక తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకే వెళ్ళవలసి ఉంటుంది.
ఇప్పటికే ఈ వివాదం గురించి ఆంద్ర తెలంగాణా మంత్రులు గంటాశ్రీనివాసరావు, జగదీశ్ రెడ్డి గవర్నర్ నరసింహన్ వద్ద పిర్యాదులు చేసుకొన్నారు. వారిరువురికీ ఆయన ఇచ్చిన కొన్ని సలహాలు ఆమోదయోగ్యం కాకపోవడంతో ఈ అంశంపై ప్రతిష్టంభన నెలకొని ఉంది. కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో తలదూర్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరిగా కోర్టును ఆశ్రయించక తప్పక పోవచ్చును.
కానీ రెండు ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఈ పంతాలు, పట్టింపులు కారణంగా మధ్యలో విద్యార్ధులు నలిగిపోతున్నారు. కనీసం వారి సమస్యలను, ఆందోళనను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత విధివిధానాలనే అనుసరించి, వచ్చే విద్యా సంవత్సరం నుండి రెండు రాష్ట్రాలు విడివిడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరిస్తే అందుకు విద్యార్ధులు కూడా మానసికంగా తయారవగలరు. ఒకవేళ ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోకపోతే, కేంద్ర ప్రభుత్వమే ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేప్పట్టడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చును.