వందల కోట్లు.. అప్పనంగా.. ఎలా?
posted on Feb 14, 2015 @ 9:55PM
ఒక సామాన్య మద్య తరగతి వ్యక్తో లేక ఒక నిరుపేద రైతో అత్యవసరంగా డబ్బు కావలసివచ్చి అప్పు కోసం బ్యాంకులకి వెళితే అందుకోసం వారు అనేక ధ్రువ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చివరికి తమకున్న ఇల్లో, స్థలమో, బంగారమో తాకట్టుగా పెట్టినా సవాలక్ష ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది. వారు తాకట్టు పెడుతున్నవి తమ స్వంతమేనని రుజువులు చూపించాల్సి ఉంటుంది. అయినా కూడా బ్యాంకులు వారి సమాధానాలకు, సమర్పించిన పత్రాలకు సంతృప్తి చెందక వారికి అప్పులు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. ఒకవేళ అప్పు ఇచ్చినా దానిని తీర్చడంలో ఒక్కనెల ఆలస్యమయినా బ్యాంక్ అధికారులు వచ్చి ఇంట్లో ఉన్న చెంబూ తప్పేళా పట్టుకొనిపోతుంటారు. సామాన్య ప్రజలందరికీ ఇటువంటి అనుభవాలు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి.
తమ వస్తువులను లేదా ఆస్తులను బ్యాంకుల వద్ద కుదవపెట్టి, నిజాయితీగా అప్పు తీర్చే సామాన్య ప్రజల పట్ల ఇంత కటినంగా నిబందనలు అమలుచేసే బ్యాంక్ అధికారులు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వెంకట్రామి రెడ్డి వంటి వ్యక్తులకు సరయిన పత్రాలు, ఆధారాలు లేకుండానే ఏకంగా రూ.357 కోట్లు అప్పు ఏవిధంగా ఇచ్చాయో? వాటి కోసం ఆయన నకిలీ డాక్యుమెంట్లు సమర్పిస్తే వాటిని ఎందుకు గుర్తించలేకపోయారో ఆయనకు అప్పు ఇచ్చిన ఆ బ్యాంక్ అధికారులే చెప్పాలి. ఇందులో మరో విచిత్రం ఏమిటంటే ఆయన ఒకే ఆస్తికి చెందిన పేపర్లను ఫోర్జరీ చేసి నాలుగు వేర్వేరు బ్యాంకుల వద్ద తనఖా పెట్టి మొత్తం రూ.1200 కోట్లు వరకు అప్పు సంపాదించడం.
మీడియా అంటే సమాజంలో మంచి, చెడులకు అద్దం పడుతూనే చెడును రూపుమాపేందుకు కృషి చేసే కీలక పాత్ర పోషిస్తుంటుంది. అందుకే మీడియాలో ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయో ఎత్తి చూపిస్తూ వాటిని నిర్మూలించడానికి తన వంతు కృషి చేస్తుంటుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా నాలుగవ స్థంభం వంటిదని ప్రజలు అందుకే భావిస్తుంటారు. కానీ అటువంటి మీడియాకే చెందిన ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డెక్కన్ క్రానికల్ పత్రిక యజమాని వెంకట్రామి రెడ్డి బ్యాంకులను ఈవిధంగా మోసం చేయడాన్ని ఏమనుకోవాలి?
సామాన్యుడికి పది పదిహేను వేలు అప్పించేందుకు సవాలక్ష కుంటిసాకులు చెప్పి తప్పించుకొనే బ్యాంకులు వెంకట్రామి రెడ్డికి ఏకంగా అన్ని వందల కోట్ల రూపాయలు కళ్ళుమూసుకొని గుడ్డిగా ఏవిధంగా చేతిలో పోసాయి? ఆనాడు కళ్ళు తెరవలేని బాంకులు ఇప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతున్నట్లు?