చివరి క్షణాల్లోనూ సెల్ఫీ ఆలోచనా?
posted on Feb 14, 2015 @ 9:18PM
తెలుగు టీవీ సీరియల్స్ లో నటించే దీప్తి అనే ఒక నటి శుక్రవారం రాత్రి ఫతే నగర్ లో తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోయింది. ఆమె మరణానికి కారణాలు ఇంకా కనుగొనవలసి ఉంది. అయితే ఈ కేసులో ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే ఆమే ఆత్మహత్య చేసుకొంటూ దానిని తన ఐ-ప్యాడ్ కున్న కెమెరా ద్వారా చిత్రీకరించుకొని మరీ చనిపోయింది. ఇది వినడానికి చాలా విచిత్రంగానే ఉంది.
ఎంతో తీవ్ర మనోవేదన లేదా ఏదో బలమయిన కారణం లేనిదే ఎవరూ ఆత్మహత్య చేసుకోరు. ఆమె తన ఆత్మహత్యని సేల్ఫీ ద్వారా చిత్రీకరించుకొన్నప్పటికీ తను దానిని చూడలేననే సంగతి ఆమెకి తెలిసే ఉంటుంది. కానీ అటువంటి తీవ్ర ఉద్వేగ సమయంలో కూడా ఐ-ప్యాడ్ ని ఉపయోగించి సేల్ఫీ తీసుకోవాలనే ఆలోచన చేయడం చూస్తే ఈ ఆధునిక పరిజ్ఞానం యువతకు ఏవిధమయిన మేలయినా చేస్తోందా లేక వారిని వ్యసనపరులుగా చేస్తోందా? అనే అనుమానం కలగకమానదు.
నేటి సమాజంలో యువత ఫేస్ బుక్, ట్వీటర్, వాట్స్ అప్, యూ ట్యూబ్, సెల్ ఫోన్స్ వంటి వాటికి ఎంతగా బానిసయిపోయిందో తెలుస్కోవడానికి ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఒక చిన్న అగ్గిపుల్లతో దీపం వెలిగించవచ్చును అలాగే ఒళ్ళు కాల్చుకోవచ్చును కూడా. అందుబాటులోకి వస్తున్న ఈ అత్యాధునిక పరిజ్ఞానాన్ని తమ జీవితంలో అత్యున్నత స్థితికి చేరుకొనేందుకు ఉపయోగించుకొనే అవకాశం ఉన్నప్పటికీ, దానికి యువత ఈవిధంగా బానిసలయిపోవడం చాలా దురదృష్టకరం. దేశ భవిష్యత్ యువత మీదే ఆధారపడి ఉన్నప్పుడు వారు దైర్యంగా దాని పగ్గాలు చేతబట్టి దేశాన్ని ముందుకు నడిపించవలసిన తరుణంలో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి బానిసలయిపోతుండటం చాలా ఆందోళన కలిగిస్తోంది.