కారెక్కడానికి 'దానం దారి' క్లియరైనట్లేనా!
posted on Sep 20, 2015 @ 1:20PM
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ...టీఆర్ఎస్ లో చేరతారంటూ మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఈనెల 23న గులాబీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరారైందని, మంత్రి తలసాని మధ్యవర్తిత్వంలో కారు ఎక్కడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చినా దానం ఖండించడంతో ఊహాగానాలకు తెరపడింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ వార్తలు రావడంతో ఈసారి ఖాయంగా కారెక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దానంకు అధికార పార్టీ వలేసిందని, ఆయన దాదాపు టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైందని గులాబీ నేతలు చెబుతున్నారట, అయితే ఎప్పటిలాగే అలాంటిదేమీ లేదని దానం నాగేందర్ ఖండించినా, ఈరోజు తిట్టి, రేపు పార్టీ మారిపోతున్న ఈరోజుల్లో ఏదైనా సాధ్యమేనంటున్నారు జనాలు. టీఆర్ఎస్ తో ఇంకా చర్చలు జరుగుతూ ఉండొచ్చని, డీల్ ఓకే కాగానే జంపై పోతారని చెవులు కొరుక్కుంటున్నారు.