నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటా.. రాష్ట్రపతికి శిరోముండనం బాధితుడి లేఖ
posted on Aug 11, 2020 @ 11:12AM
గత నెల జులై 18న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లో పోలీసులు దళిత యువకుడైన ప్రసాద్ కు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై ఏపీలో తీవ్ర దుమారం రేగిన సంగతి కూడా తెలిసిందే. అయితే తనకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన చెందిన బాధితుడు ప్రసాద్ తాజాగా " నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటాను. నాకు అనుమతి ఇప్పించండి. ఇక్కడ నాకు ఎవరూ న్యాయం చేయడంలేదు" అంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. రాష్ట్రపతి గ్రీవెన్స్‌కు ఈ మేరకు అయన ఈ లేఖ రాశారు. గతనెల 18న సీతానగరం పోలీసుస్టేషన్‌లో వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తనకు ఎస్‌ఐ శిరోముండనం చేసి హింసించారని ఆ లేఖలో అయన వివరించారు. ఈ లేఖ రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు చేరిందని, తమ పరిశీలనలో ఉందని స్టేటస్ లో తెలపడం జరిగింది. "నేను చాలా పేదకుటుంబానికి చెందిన వాడిని. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పు అయినట్లుంది" అని ప్రసాద్ ఆ లేఖలో పేర్కొన్నారు.
జులై 22న సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా శిరోముండనాన్ని సీరియస్ గా భావిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ కేసు విషయంలో ఏడుగురి మీద ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్ లో 6వ ముద్దాయి ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తికాగా, 7వ ముద్దాయి పోలీసు అధికారి అయిన ఎస్‌ఐ కాగా అతడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి, జైలుకు కూడా పంపారు. అయితే ఎఫ్‌ఐఆర్ లో 1 నుంచి 6 వరకూ ఉన్న ముద్దాయిలను మాత్రం ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో వీరే ప్రధాన నిందితులు. అంతే కాకుండా ఇక్కడ ఎస్‌ఐ ఉద్యోగంలో చేరి కేవలం 48 గంటలు అయింది. ఆయనకూ, నాకూ ఎటువంటి వ్యక్తిగత గొడవలు లేవు. అసలు ఈ శిరోముండనం కేసు విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్‌పీ కూడా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. నాకు ఏవిధమైన సహాయమూ చేయలేదు. నేను దళితుడిని కావడం వల్లే నాకు న్యాయం జరగడంలేదు. "నేను నా పరువు కాపాడుకుంటాను... దయవుంచి నక్సల్స్‌లో చేరడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి" అని రాష్ట్రపతికి రాసిన ఆ లేఖలో ప్రసాద్ పేర్కొన్నారు. అయితే ఈ కేసు రాష్ట్రపతి దృష్ఠికికూడా వెళ్ళిన నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.