Read more!

వైకాపాలో చేరినందుకు చింతిస్తున్నా: దాడి

 

తెదేపాతో ముప్పై ఏళ్ల అనుబంధాన్ని పుటుక్కున తెంచుకొని గతేడాది వైకాపాలో చేరిన దాడి వీరభద్రరావు, పట్టుమని ఏడాది తిరగకుండానే వైకాపా ను ఈరోజు వదిలించుకొని బయటపడ్డారు. వైకాపాలో చేరి ఘోర తప్పిదం చేసానని, ఇప్పుడు ఆ తప్పు సవరించుకొనేందుకే ఈరోజు పార్టీకి తను, తన కుటుంబ సభ్యులు రాజీనామా చేస్తున్నామని మీడియాకు తెలియజేసారు.

 

ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా విమర్శించారు. “జగన్మోహన్ రెడ్డి చాలా నిరంకుశంగా వ్యవహరిస్తారు. ఆయనకి పార్టీ నేతలెవరినీ సంప్రదించే అలవాటు లేదు. ఎవరి సలహాలు వినే అలవాటు అసలే లేదు. తనకు తోచిన నిర్ణయాలు తీసుకొంటారు. నేను జైల్లో చూసిన జగన్ వేరు. ఇప్పుడు కనబడుతున్న జగన్ వేరు. ఆయన 18 నెలలు జైల్లో ఉన్నారు గనుక ఆయనలో చాలా మార్పు వస్తుందని అందరం భావించాము. కానీ ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. జైలు నుండి వచ్చిన తరువాత కూడా ఆయన అదే అహంకారం ప్రదర్శించడం చూసి అందరం చాలా ఆశ్చర్యపోయాము."

 

"ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను నిర్ణయించే విషయంలో కూడా ఆయన ఎవరి మాట వినలేదు. తనకు నచ్చిన వారిని నిలబెట్టారు. జైలులో పరిచయమయిన వ్యక్తులకు టికెట్స్ ఇచ్చి తను ఎవరిని నిలబెట్టినా ప్రజలు గుడ్డిగా నమ్మి వారికే ఓటేస్తారనే అహం ప్రదర్శించారు. ఆయన తీరు చూసి పార్టీలో నేతలే కాదు ప్రజలు కూడా చాలా భయపడ్డారు. అందుకే ఎన్నికలలో వైకాపాను ఓడించారు. అటువంటి నిరంకుశుడు, అహంకారం కలవాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా చాలా భయం వేస్తోంది. అందుకే ప్రజలు అయనకు ఓటేయకుండా చాలా విజ్ఞత ప్రదర్శించారు."

 

"నిజానికి ఆయన తన తల్లిని, చెల్లిని కూడా విశ్వసించరు. తన చెల్లి షర్మిలకు టికెట్ ఇస్తే ఆమె తనకు ఎక్కడ పోటీగా తయారవుతుందో అనే భయంతోనే ఆమెకు టికెట్ ఇవ్వకుండా తల్లికి ఇచ్చేరు. అయినప్పటికీ ఆయన తన తల్లి కూడా ఎన్నికలలో గెలవాలని మనస్పూర్తిగా కోరుకోలేదు, ప్రయత్నించాను లేదు. అందుకే ఆమె కూడా ఓడిపోయారు. స్వంత తల్లిని, చెల్లినే నమ్మని వ్యక్తి ఇక పార్టీలో నేతలను ఎందుకు నమ్ముతారు? అటువంటి వ్యక్తిని ప్రజలు మాత్రం ఎందుకు నమ్ముతారు?పార్టీలో ఉండాలంటే ఆయన చెప్పినట్లు చేయాలి తప్ప స్వంత ఆలోచనలు చేయడానికి వీలులేదు. మేము ఎన్నికల సమయంలో ఆయనకీ కొన్ని సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించాము కానీ ఆయన మా మాటలను ఎన్నడూ ఖాతరు చేయలేదు."

 

"అసలు పార్టీని ఎలా నడపాలో తెలియని ఆ వ్యక్తి, ఎంత కాలం పార్టీని నడుపుతారో, అసలు నడుపుతారో లేక మూసేసివెళ్లిపోతారో లేకపోతేవేరే ఏదయినా పార్టీలో కలిపేస్తారో ఎవరికీ తెలియదు. అందువల్ల పార్టీలో కార్యకర్తలు,నేతలూ అందరూ కూడా ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మేలని నా సలహా. నియంతృత్వ పోకడలు పోతున్న జగన్మోహన్ రెడ్డి క్రింద ఇక ఎంతమాత్రం పనిచేయడం అసంభవమని గ్రహించినందునే నేను, నా కుటుంబ సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ప్రస్తుతం నేను ఏ పార్టీలోను చేరబోవడం లేదు. కొంతకాలం తరువాత తగిన నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు.