సొంత జిల్లాలో జగన్ కు షాక్.. ప్రభుత్వంపై వైసీపీ నేతల ధిక్కారం
posted on May 25, 2021 @ 1:26PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాలోనే పట్టు పోతుందా? పార్టీ నేతలు కూడా ఆయనను ధిక్కరిస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. కడప జిల్లాకు సంబంధించి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక వైసీపీ నేతలే ధిక్కరించారు. బహిరంగంగానే వ్యతిరేకించారు. అంతేకాదు సీఎం ప్రకటనకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కూడా చేస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు రోడ్డెక్కడం ఇప్పుడు కడప జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు. గడికోట సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. రాయచోటి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉంది. రాయచోటిలో ప్రభుత్వ కళాశాలకు చెందిన 4 ఎకరాల స్ధలం వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని కోరారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. దీంతో సీఎం వెంటనే ఆ స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు ఇస్తూ ప్రకటన చేశారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా.. నియోజకవర్గంలో బలమైన వైసీపీ నేతగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెరపైకి వచ్చారు. వక్ఫ్ బోర్డు స్ధలం పరిరక్షణ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాసంఘాలను, విపక్షాలను, ముస్లిం మైనార్టీలను కలుపుకుని ఏకంగా చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కాలేజీ కోసం భూమి కేటాయిస్తూ సీఎం జగన్ ప్రకటన చేశాక కూడా.. రాంప్రసాద్ రెడ్డి ఆందోళన చేయడం స్థానికంగా సంచలనంగా మారింది.
వైసీపీ నేత మండ్ర రాంప్రసాద్ రెడ్డి బహిరంగంగా నిరసనకు దిగడం వెనక అసలు కారణం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనే చర్చ జరుగుతోంది. గతంలో రాయచోటి కేంద్రంగా మండిపల్లి, సుగవాసి కుటుంబాల మధ్య రాజకీయ పోరు నడిచేంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం గడికోట, రెడ్డప్ప గారి కుటుంబాల మధ్య పోరుగా మారిపోయింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎన్నికవుతూ వస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి తనయుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాస్ లీడర్ గా గుర్తింపుతెచ్చుకున్నారు. ఈయనను నియోజకవర్గంలో రాముడు అంటూ పిలుచుకుంటుంటారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగానే ఉన్నారు. వైసీపీ ఆవిర్భవించిన అనంతరం 2009లో కాంగ్రెస్ తరుపున ఉప ఎన్నికల్లో పోటీచేశారు. అప్పుడు వైసీసీ తరుపున గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాముడు వైసీపీకి అనుకూలంగానే ఉన్నా..., ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీచేయలేదు.
శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలో అడుగుపెట్టిన నాటి నుంచి నియోజకవర్గ నాయకులు, నేతలతో కొందరిని కలుపుకుపోయినా.., మరికొందరి పట్ల మాత్రం పట్టువిడుపులు ప్రదర్శించినట్లు నియోజకవర్గంలో టాక్. శ్రీకాంత్ రెడ్డి దూరం పెట్టిన ప్రముఖుల్లో రాముడు పేరే వినిపిస్తుంది. పార్టీ కార్యక్రమాల్లో గానీ, ప్రముఖుల పర్యటనల్లో గానీ రాముడి ప్రస్తావన లేకుండా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేస్తున్నారన్న అసంతృప్తి ఉంది. రాముడి పేరు మీద ఎవైనా ప్రతిపాదనలు వచ్చినా, ఎవరైనా ఆయన సిఫార్సుతో పనుల కోసం వచ్చినా చెయ్యవద్దని నియోజకవర్గ అధికారులకు, పార్టీ నేతలకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. కనీసం పోలీసు స్టేషన్ లలోను రాముడి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్న ప్రచారం ఉంది.ఎమ్మెల్యేపై తిరుగుబాటుకు ప్రజాసమస్యలనే అజెండాగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి ఏకంగా సీఎం ప్రకటనలనే వ్యతిరేకించే స్థాయికి చేరిందనే చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఒకవేళ మరోసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే రెబల్ అభ్యర్ధులను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. మొత్తంగా ఎమ్మెల్యే పైన ఉన్న అసమ్మతి చివరకు ఇలా సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. సొంత జిల్లాలోని పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తే.. జగన్ కు కష్టాలు తప్పవని తెలుస్తోంది.