రాందేవ్ బాబా మరో బాంబ్.. అలోపతి వైద్యంపై 25 ప్రశ్నలు..
posted on May 25, 2021 @ 12:42PM
సర్వరోగ నివారిణి అంటే అది జిందా తిలస్మాద్ ఒక్కటే. మిగిలినవన్నీ ఔషధాలు. అవి అలోపతి టాబ్లెట్, సిరప్, ఇంజక్షన్, సర్జరీ మరోటీ అయినా, ఆయుర్వేదం గుళికలు, కషాయాలు అయినా యునాని, హోమియో మందులే అయినా, అవేవీ కూడా పూర్తి భరోసాను ఇవ్వవు. రోగం నయం చేసే విషయంలోనే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ విషయంలోనూ కూడా నూటికి నూరు శాతం, పర్ఫెక్ట్ అని చెప్పుకునే మందు ఏదీ లేదు. అసలు అలా చెప్పుకోవడం శాస్త్రీయం అనిపించుకోదు.
ఈ కోణంలో ఆలోచన చేసినప్పుడు, అలోపతి వైద్యం వైద్యమే కాదు. కరోనా మరణాలకు అలోపతి చికిత్సలో ఉన్న లోపాలే సగం కారణం అంటూ, బాబా రాందేవ్, చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సమంజసం కాదు. అందుకే ఆయన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దుమారం రేపాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బాబా వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా, ఆయన మీద చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతే కాదు, ఆయన మీద చర్యలు తీసుకోకుంటే, అలోపతిని వైద్యాన్ని మొత్తానికి మొత్తంగా రద్దు చేయండని కొంచెం తీవ్ర స్వరంతో హెచ్చరికలాంటి అభ్యర్ధన చేసింది. బాబా రాందేవ్ వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. అలోపతి వైద్య విధానానికి వ్యతిరేకంగా చేసినవ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని, చాలా ఘాటైన లేఖ రాసారు. కరోనా రోగుల ప్రాణాలను కాపాడడంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధి సేవలు అందిస్తున్న అలోపతి వైద్యులను అవమానించడం బాధ్యత రాహిత్య చర్య అంటూ బాబా రాందేవ్ పై ఆగ్రహం వ్యక్త చేశారు. బాబా రాందేవ్ కూడా మంత్రి లేఖపై పాజిటివ్ గా స్పందించారు. అలోపతి గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటించారు.
అంతటితో ఆ వివాదం ముగిసి పోతుంది అనుకుంటే, ఇప్పుడు తాజాగా, బాబా రాందేవ్ మరో బాంబు పేల్చారు. కొన్నింటికి అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విటర్‌లో బహిరంగ లేఖ రాశారు. అందులో ప్రధానంగా, బీపీ, మధుమేహానికి అలోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదు? థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఉబ్బస వ్యాధుల శాశ్వత నివారణకు ఫార్మా కంపెనీల వద్ద మందులు ఉన్నాయా? కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, కొవ్వుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?పార్శపు నొప్పి, మతిమరుపు, పార్కిన్‌సన్ వ్యాధులను ఏ విధంగా నయం చేస్తారు?అంటూ ‘ఐఎంఏ’ ముందు తమ సందేహాలను ఉంచారు.
అల్లోపతికి కేవలం 2 వందల ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని.. ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని రాందేవ్ బాబా గుర్తు చేశారు. అల్లోపతి అన్నింటికీ సమాధానమైతే..వైద్యులకు ఎటువంటి రోగమూ రాకూడదని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. నిజానికి బాబా రాందేవ వ్యక్త పరిచిన అనుమానాలు, ఆయా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు, అనుమానాలే కాబట్టి, ఇందులో అలోపతి విధానాన్ని అవమానించడమో మరొకటో లేదు. ఇప్పుడు బంతి మాత్రం అలోపతి కోర్టులో, ఉంది. సమాధానం ఎలా ఉంటుందో చూడవలసి ఉంటుంది. అదలా ఉంటే, కారణాలు ఏవైనా విభిన్న వైద్య విధానాల మంచి చెడులు, బాగోగులపై చర్చకు కరోనా, ఒక అవకాశాన్ని కలిపించింది. కాబట్టి, ఈ చర్చ మరింత నిర్మాణాత్మకంగా కొనసాగితే, విభిన్న వైద్య విధానాల విషయమలో గల విబేధాలు తొలిగిపోయి , అవగాహన పెరుగుతుందని, నిపుణులు సూచిస్తున్నారు.