నిండుకుండలా శ్రీశైలం డ్యామ్.. 14 ఏండ్ల తర్వాత జూలైలోనే గేట్లు ఓపెన్!
posted on Jul 28, 2021 9:24AM
ఎగువన నుంచి భారీగా వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. జురాలతో పాటు తుంగభద్ర నుంచి డ్యాంలోకి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో బుధవారం సాయంత్రం డ్యాం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జలాశయం గేట్లను పైకెత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. 2007 తర్వాత జూలై నెలలోనే శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనుండడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
శ్రీశైలం జలాశాయానికి ఇన్ ఫ్లో బుధవారం ఉదయం 4,66,864 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో: 62 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం : 879.30 అడుగులు కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ : 215.8070 టీఎంసీలు కాగా,..ప్రస్తుతం 184.27 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనుండటంతో దాన్ని చూసేందుకు పర్యాటకులు ఉత్సాహ పడుతున్నారు. దీంతో శ్రీశైలం డ్యామ్ దగ్గర పర్యాటకుల సందడి పెరిగింది. నాగార్జున సాగర్ లోనూ ప్రస్తుతం 190 టీఎంసీలకు పైగానే నీళ్లు ఉన్నాయి. ఎగువ నుంచి మరో మూడు రోజులు వరద కొనసాగే అవకాశం ఉంది. దీంతో నాలుగైదు రోజుల్లోనే నాగార్జున సాగర్ డ్యాం కూడా పూర్థిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.