ఏపీ రెడ్ జోన్లను కేంద్రం నమ్మలేదా? హాట్ స్పాట్ల ప్రకటన వెనుక కథేంటి?
posted on Apr 16, 2020 @ 7:52PM
ఏపీలో కరోనా వైరస్ ప్రభావాన్నితక్కువ చేసి చూపేందుకు ముందునుంచీ ప్రయత్నిస్తున్న సీఎం జగన్.. రెడ్ జోన్ల ఎంపిక కూడా అదే తరహాలో చేశారనే వాదనలు ఉన్నాయి. ఇందుకు తగినట్లుగానే రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలన్న ఆలోచన కూడా జరిగిందనే వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపించింది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్యనే తక్కువ చేసి చూపుతున్నారని విపక్ష టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో రెడ్ జోన్ల ఎంపిక ద్వారా లాక్ డౌన్ ప్రభావాన్ని తగ్గించాలని జగన్ సర్కార్ భావించింది. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టినట్లు తాజాగా కేంద్రం చేసిన హాట్ స్పాట్ల ప్రకటనతో అర్ధమవుతోంది. దేశవ్యాప్తంగా హాట్ స్పాట్ లను ప్రకటించిన కేంద్రం.. ఈ నెల 20 తర్వాత వాటిలో మినహా మిగిలిన చోట్ల సడలింపులు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. ఇందులో భాగంగా ఏపీలో మొత్తం 13 జిల్లాలు ఉంటే ఏకంగా 11 జిల్లాలను హాట్ స్పాట్లుగా ప్రకటించింది.
ఏపీలో అంతకుముందే కరోనా వైరస్ పాటిజివ్ కేసులు నమోదైన 133 ప్రాంతాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించి చేతులు దులుపుకుందామని భావించిన జగన్ సర్కారుకు కేంద్రం చేసిన హాట్ స్పాట్ల ప్రకటన మింగుడు పడటం లేదనే చెప్పవచ్చు. రెడ్ జోన్లలో లాక్ డౌన్ ఉంచి మిగతా ప్రాంతాల్లో ఏప్రిల్ 14 తర్వాత సడలించాలని భావించిన జగన్ సర్కారు.. ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటనతో కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతోందని అర్ధమవుతోంది. అలాగని కేంద్రంతో ఘర్షణకు దిగే పరిస్ధితి లేదు. కాబట్టి ఏప్రిల్ 20 తర్వాత హాట్ స్పాట్లుగా గుర్తించిన 11 జిల్లాలు మినహాయించి కేవలం శ్రీకాకుళం, విజయనగరం రెండు జిల్లాల్లోనే లాక్ డౌన్ ను సడలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అలాగని అక్కడా పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ సడలించే పరిస్ధితి లేదు. కేవలం పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు, మైనింగ్ వంటి వాటికే అనుమతులు ఇవ్వడం ద్వారా తనకు అనుకూలమైన పరిస్ధితిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.