నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారం లో హైకోర్టును రెండు రోజులు గడువు కోరిన ఏపీ ప్రభుత్వం
posted on Apr 16, 2020 @ 8:49PM
ఎలక్షన్ కమిషనర్ తొలిగింపు వ్యవహారం లో ప్రమాణ పత్రం దాఖలు చేసేందుకు రెండు రోజులు అదనపు సమయం కావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టునుకోరింది. శనివారం వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యర్ధించారు. రిజిస్ట్రార్ జ్యుడీషియరికి మెయిల్ ద్వారా అడ్వొకేట్ జనరల్ ఈ విషయం తెలిపారు. తమముందు ఉన్న అవకాశాల ద్వారా కోర్టులో వాదనలు వినిపించేందుకు గడువు కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వై ఎస్ ఆర్ సి పి కూడా పార్టీ పరంగా ఈ విషయం లో పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే, విజయసాయి రెడ్డి -డి జి పి కి ఒక లేఖ రాస్తూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతకాన్ని తెలుగుదేశం నాయకులు ఫోర్జరీ చేశారనీ, ఆ లేఖలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలనీ కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మరో వైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయంలో జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందనే విమర్శలు అన్ని విపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. అయితే విమర్శల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం దురుద్దేశపూరితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందనే వాదనకు మద్దతుగా న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనది ఆర్ఢినెన్స్ లో కొన్ని కీలక అంశాలను విస్మరించడంతో పాటు అప్పటికే పదవిలో ఉన్న వ్యక్తికి కొత్త నిబంధనల వర్తింపు వంటివి కూడా ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కోసం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. అయితే ఇందులో ఒక అంశానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రెండో అంశం మాత్రం కచ్చితంగా నిమ్మగడ్డను టార్గెట్ చేసి పెట్టిందే అనే భావన న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కమిషనర్ పదవీకాలం సవరణ చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగో ఉంది. ఈ విషయంలో నిమ్మగడ్డకు ఎలాంటి రాజ్యాంగ రక్షణ లభించబోదు. అయితే ఆయన సర్వీసు రూల్స్ లో మార్పులు చేసే విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ లో ప్రస్తావించిన సర్వీస్ రూల్స్ మార్పు వ్యవహారం కొత్త కమిషనర్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిందే. అయితే ఈ నిబంధన విషయంలో రాజ్యాంగంలో ఉన్న అర్ధం ప్రకారం ప్రస్తుత కమిషనర్ సర్వీస్ రూల్స్ ను మార్చడం ద్వారా ఆయనకు నష్టం కలిగేలా చేయరాదన్నది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్టికల్ 243లోని పదవీకాలం నిబంధన మాత్రమే వాడుకుని నిమ్మగడ్డను తొలగించింది.