సెకండ్ వేవ్ హర్రర్.. 100డేస్ అలర్ట్
posted on Mar 25, 2021 @ 6:01PM
దేశంలో కరోనా సెకండ్ వేవ్. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదంటోంది ఓ సంస్థ. ఈ సెకండ్ వేవ్ దాదాపు 100 రోజులు ఉంటుందని తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపింది. ఏప్రిల్ 15 తర్వాత వైరస్ తీవ్రత తారాస్థాయికి చేరుతుందని చెప్పింది. సెకండ్ వేవ్‌లో దేశ వ్యాప్తంగా 25లక్షల మంది వైరస్ బారిన పడే ఛాన్స్ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక అంచనా వేసింది. ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్‌లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం వల్ల పరిస్థితిలో మార్పు ఉండవచ్చునని తెలిపింది.
లాక్‌డౌన్, కంటైన్మెంట్ జోన్లతో అంతగా ప్రయోజనం ఉండదని.. కరోనా కట్టడికి వ్యాక్సినేషనే సరైన మార్గమని ఎస్బీఐ అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34లక్షల డోసులు పంపిణీ చేస్తున్నారు. వీటిని రోజుకు 45లక్షలకు పెంచినా.. 45ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించాలంటే మరో 4 నెలల సమయం పడుతుందని తెలిపింది.
మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. గురువారం 53,476 కొత్త కేసులు వచ్చాయి. రెండు రోజుల్లోనే కొవిడ్ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక రోజులో ఇంత ఎక్కువగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.