వాణీదేవి.. ఐరన్ లెగ్?
posted on Mar 25, 2021 @ 6:25PM
గొడ్డొచ్చిన వేళ.. పిల్లొచ్చిన వేళ.. దేనికైనా టైమ్ బాగుండాలంటారు. లేదంటే, మంచి జరగదనేది ఆ నానుడి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి విషయంలోనూ అలాంటి చర్చే జరుగుతోంది. ఇదేమీ సీరియస్ పొలిటికల్ డిస్కషన్ కాకపోయినా.. కొంత వెటకారమే అయినా.. వారు చెప్పే కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటో వింటే.. అవునుకదా? నిజమేకదా? అనిపిస్తున్నాయి.
అతికష్టం మీద ఎమ్మెల్సీగా గెలుపొందారు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి. ఊహించని విజయంతో గులాబీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ భవన్‌లో ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ జరిగాయి. తీన్మార్ డ్యాన్సులతో కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. బాణాసంచా పేలుళ్లతో సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో, బాణాసంచా పేలుడుతో తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. నిప్పురవ్వలు ఎగిసిపడి.. పందిరి తగలబడింది. ఎమ్మెల్సీగా వాణీదేవి ఎన్నికవగానే.. తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం జరగడం కీడంటూ కొందరు వ్యాఖ్యానించారు. టపాసులు కాల్చినప్పుడు ఇలాంటివి కామన్ అంటూ మరికొందరు తీసి పడేశారు. దీంతో.. అప్పుడా విషయాన్ని అంతా లైట్ తీసుకున్నారు. కానీ....
గురువారం ఎమ్మెల్సీగా మండలికి వచ్చారు వాణీదేవి. ఆమె వచ్చిన కారు ప్రమాదానికి గురవడం కలకలం రేపింది. అసెంబ్లీ గేట్ నెంబర్ 8ని కారు ఢీకొట్టింది. ఆ సమయంలో వాణీదేవి కారులో లేరు. కారును పార్కింగ్ చేస్తుండగా అదుపు తప్పిన సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. కారు టైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్ నడిపారు. కారు టైరు పేలి పెద్ద శబ్ధం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు.
ఎమ్మెల్సీగా గెలిచిన రోజు తెలంగాణలో అగ్ని ప్రమాదం. మండలికి వచ్చిన రోజు కారు ప్రమాదం. ఈ రెండు ఘటనలతో ఎమ్మెల్సీ వాణీదేవి ఐరన్ లెగ్గా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు. రెండు కీలకమైన రోజుల్లో.. రెండు ప్రమాదాలు జరగడం యాధృచ్చికమా? లేక, కీడా? అని అనుమానిస్తున్నారు. రెండు దుర్ఘటనలకు వాణీదేవికి లింక్ ఉండటంతో.. మేడమ్‌ది ఐరన్ లెగ్ అంటూ చర్చించుకుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇలాంటి ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు మరికొందరు హేతువాదులైన పార్టీ శ్రేణులు.