Read more!

ఇదేమీ ‘ఈశా’.. అర్థరాత్రి చిందులేమి ఈశ్వరా?!

ఈశా ఫౌండేషన్ అంటే ‘సద్గురు’ రూపం కళ్ల ముందు కదులుతుంది. ఆయన వేషధారణలోని ప్రత్యేకత ఆయనను అలా పట్టిస్తుంది. ఆద్యాత్మిక ప్రపంచంలో సద్గురుకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో సందేహం లేదు. అలాగే, ఈశా ఫౌండేషన్’కు కూడా అంతే గుర్తింపు, గౌరవం ఉన్నాయి.  ప్రతి సంవత్సరంలానే, ఈ సారి కూడా కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్, అధ్వర్యంలో శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. అయితే, జాగారం పేరున.. అర్థరాత్రి అంకమ్మ శివార్లు  అన్నట్టు, ఆ గంతులు, చిందులు ఏమిటి? మంగ్లీ పాటకు సద్గురు చిందులు వేయడం ఏమిటి? 

మంగ్లీనో, ఆమె పాటనో తక్కువ చేయడం కాదు. ఆమె చక్కని గాయిని. ఆమె పాడిన అనేక జానపద గీతాలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే, శివరాత్రి వేడుకల్లో ఆమె పాడిన పాటలు అన్నీ కూడా శ్రోతలను భక్తి పరవసులను చేసే పాటలే. అలాగే ఇతర గాయనీ గాయకులు పాడిన పాటలు కూడా భక్తి భావాన్ని నింపే పాటలే. సందేహం లేదు. అవే పాటలు, సందర్భానికి తగినట్లుగా గానం చేసుంటే బాగుండేది అనేది ప్రత్యక్షంగా, ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాన్ని చూసిన చాలా మంది భక్తులు వ్యక్తపరుస్తున్న   అభిప్రాయం, ఆగ్రహం. మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఒక పవిత్ర ఆద్యాత్మిక వేడుకను పరవశం పేరుతో ఇలా వళ్ళుమరిచి, తూలుతూ, తేలుతూ సాగే.. ప్రాశ్చాత్య కల్చరల్ ఈవెంట్ స్థాయికి దిగాజార్చారనే అవేదనను అనేకమంది వ్యక్తం చేస్తున్నారు. 


శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేస్తారు? శివరాత్రి జాగారం ఎందుకు? ఈ అన్ని ప్రశ్నలకు మన పురాణ ఇతిహాసాలలో, ఋషుల పలుకులో  సమాధానాలున్నాయి. ప్రవచనకర్తలు ఆ పురాణం ఇతిహాసాల సారాన్ని విడమరిచి చెపుతూనే ఉన్నారు. ఉపవాసం లక్ష్యం పంచేంద్రియాలను భగవంతునికి చేరువ చేయడం అయితే, జాగారం అర్థం, పరమార్ధం, ‘నేను వినా మరొకటి లేదు’ అన్న అత్మానంద అనుభూతిలోకి పోవడం. అంటే , పరమాత్మలో ఆత్మను విలీనం చేసి పరమానంద అనుభూతిని పొందడం. నిజానికి, సద్గురు, తమ ఉపన్యాసంలో అదే చెప్పారు, “ఈ రాత్రి కేవలం ఒక జాగారం రాత్రి మాత్రమే కాదు, ఇది మీకు ఒక  మేలుకొలుపు, జ్ఞాన కొలుపు  కావాలి” అనే సద్గురు తమ సందేశంలో చెప్పారు. చీకటి అనే సందిగ్ధం నుంచి సత్యాన్ని తెలుసుకునే పవిత్ర వేడుక శివరాత్రి జాగారం. కానీ, జరిగింది, అది కాదు. 


ఈ వేడుకలను చూసింది భారతీయులు మాత్రమే కాదు, ఈశా విడుదల చేసిన ప్రకటనలోనే పేర్కొన్న విధంగా 100 ఛానెల్‌లలో లైవ్ స్ట్రీమ్ ప్రసారమైంది. 11 భారతీయ భాషలలో మాత్రమే కాకుండా.. ఇంగ్లీషు, నేపాలీ, రష్యన్, ఫ్రెంచ్, పోర్చుగీస్, సాంప్రదాయ చైనీస్ ఇంకా సరళీకృత చైనీస్ భాషలలో కూడా ప్రసారమైంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రేక్షకులను చేరుకుంది. అయితే, భారతీయుల పవిత్ర వేడుకను అనేక ప్రపంచ దేశాల ప్రజలు ప్రజలు తిలికించినందుకు సంతోషించాలా? లేక, ప్రాశ్చాత్య ప్రపంచం ముందు తలవంపులు తెచ్చిందని విచారించాలా?