పొత్తులపై కసరత్తులు.. మునిసిపల్ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు కరువైన అభ్యర్థులు!
posted on Dec 30, 2019 @ 4:45PM
తెలంగాణలో కామ్రేడ్లు డీలా పడ్డారు. లెఫ్ట్ పార్టీలకు అభ్యర్థుల కొరత ఏర్పడింది. పొత్తుల కోసం వామపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మునిసిపల్ ఎన్నికలకు ముఖ్య పార్టీలన్ని తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అధికార పార్టీతో సహా కాంగ్రెస్, బిజెపి ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా లిస్ట్ రెడీ చేసుకుంటున్నాయి. సిపిఐ, సిపిఎం పార్టీలకు మాత్రం అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారాయి. అందుకోసమే వేరే పార్టీలతో జట్టు కట్టాలని భావిస్తున్నాయి. తమకు పట్టు ఉన్న వార్డుల్లో పోటీ చేస్తూ మిగతా చోట్ల తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మద్దతు ఇస్తామంటున్నాయి. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి తప్ప తమతో కలిసి వచ్చే మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని మునిసిపల్ ఎన్నికలకు వెళతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమకు అభ్యర్థులు లేని చోట స్వతంత్రులకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.
అయితే సుత్తి, కొడవలి పార్టీ కన్నా కంకి, కొడవలి పార్టీ మునిసిపల్ ఎన్నికల విషయంలో ఆసక్తి చూపుతోంది. తెలంగాణలో తమకు బలం ఉందని చెబుతోంది. పోరులో బీజేపీతో తప్ప ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా మున్సిపోల్స్ షెడ్యూల్ విడుదల చేశారని ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎన్నికల సంఘం అంటకాగడం మంచిది కాదని సూచించారు చాడ. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలంటే పండగ చేసుకునే లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు పోటీపై అనాసక్తి ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణలో టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడం, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ కూడా డీ కొట్టలేకపోవటం, టిడిపి బలహీన పడటంతో కామ్రెడ్ లు కూడా చతికిలబడిపోయారనే చెప్పాలి.