స్వార్ధ రాజకీయాలు ..సామర్ధ్యం లేని పాలకులు
posted on Jul 1, 2013 @ 7:06PM
....సాయి లక్ష్మీ మద్దాల
తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే నని,ఇది 56 సం॥ ల పోరాటమని ఏవేవో చాల వింత ప్రసంగాలు చేశారు మన టి కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సాధన సభ ద్వారా వారు, వారి అధిష్టానం ప్రజలకు ఏమి తెలియ జేయాలనుకున్నారో అది ప్రజలకు తెలియటమేమో కాని టి. ఆర్. ఎస్ నేతలకు బాగానే అర్ధమయింది. ఈరోజున అధిష్టానం తెలంగాణ అంశాన్ని ఒకకోలిక్కి తెస్తోంది దేనికోసం?తెలంగాణ ప్రజల మనోభావాలకు విలువనిచ్చా?లేక తన పొలిటికల్ మైలేజ్ కోసమా?కేవలం తన స్వార్ధ ప్రయోజనాలే అని తేట తెల్ల మైంది. అయితే ఇక్కడ సోనియా గాంధి ప్రజలకు ఏమని భరోసా ఇస్తుంది?కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యం లో రాష్ట్రం విడిపోయిన,కలిసున్నా ప్రజల సంక్షేమ అభివ్రిద్ది ఎలా సాధ్యం అనేది నేడు దేశ ప్రజలను వేధిస్తున్న సమస్య. ఎందుకంటే నేడు దేశాన్ని పాలిస్తున్నది రాజకీయ నాయకులు కాదు కేవలం అవినీతి మాత్రమే!విపరీతమైన కుంభ కోణాలలో,భయంకరమైన అవినీతిలో కూరుకొని పోయి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజులలో సమగ్రమైన పరిపాలనని ఎలా అందిస్తుంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం. కాని వారి పనికిమాలిన సంక్షేమ పధకాలొ లేక దిక్కుమాలిన కుల సమీకరణాలో వారిని గెలిపిస్తాయనేది వారి ప్రగాఢ నమ్మకం.
నేటి ఆధునిక నాగరిక సమాజానికి కావలసింది సమానత్వం మరియు అభివృద్ధి. కాని అలాంటి మెరుగైన పరిపాలనను అందించే సత్త ఈ పాలకులకు ఉందా?ఇది కేవలం తెలంగాణ సమస్య అని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ వారి రాజకీయ భవిష్యత్తును సరిచేసుకుంటున్నారు. మరి ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఉన్న నాయకులు రేపు ఇరు ప్రాంతాలకు సమన్యాయం ఎలా చేస్తారు. ఇక్కడ కేవలం తాగు నీరు మాత్రమే సమస్యా?మరి శాంతి భద్రతల పరంగా ఎలాంటి నివారణ చర్యలు చేపడతారు. మెరుగైన విద్య,నాణ్యమైన వైద్యం,అందరికి ఉద్యోగం అంటూ భారి డైలాగులే చెప్తున్నారు కాని ఈ సమస్యలన్నీ కలిసున్న కారణంగానే వచ్చినవా?అన్నిటికి మించి తెలంగాణ వస్తే కె. సి. ఆర్ పరిస్థితి మరో సిబుసోరెన్ లా అవుతుందని కూడా మరో వాదన ఉంది మరి ఈ నేపధ్యం లో ఆయన తన ఉనికిని కూల్పోవటానికి సిద్ధంగా ఉన్నాడా?
రాష్ట్రం ఉన్న విడిపోయిన ఇక్కడ ఇరు ప్రాంత ప్రజలకు కావలసింది అభివృద్ధి. కాని అది ఏ నాయకుల వల్ల కాదు అని ప్రజలకు అర్ధమై పోయింది. కాని నేడు ప్రజలు కోరుకుంటున్నది ఉన్న ఈ అభివృద్ధి అయిన కనుమరుగవకుండా ఉంటె చాలునని. రాజకీయనేతలందరూ వారి వారి వ్యాపారాలకు ఏది అనువుగా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. చివరకు నేటి పరిస్థితి ఎలా ఉందంటే రాయల తెలంగాణ అని రాయలసీమను రెండు ముక్కలు చేస్తున్నా చంద్రబాబు నాయిడు కూడా ఏమి మాట్లాడలేకున్నాడు. తెలంగాణ సాధన సభలో దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 44సం॥ లుగా సీమాంద్ర నేతలే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు?60సం॥ ల కాలం లో ప్రజాస్వామ్యం ముసుగులో కుటుంబ పరిపాలనే భారత దేశ ప్రజలు చూస్తున్నారు. మరి తెలంగాణ కోసం ఇంత ధైర్యంగా సభ నిర్వహించామని చెప్పుకునే ఈ కాంగ్రెస్ నేతలు గాంధి కుటుంబ పాలనను వ్యతిరేకించ గలరా?కేవలం ప్రజల సంక్షేమం,దేశ అభివృద్ధిని మాత్రమే వీరుకనుక కాంక్షిస్తే,పి.వినరసింహారావు పరిపాలనకు,నేటి సోనియా గాంధీ ఆధ్వర్యంలోని మన్మోహన్ పరిపాలనకు గల వ్యత్యాసాన్ని,దేశ ఆర్ధిక ప్రగతిని విశ్లేషించ గలరా?ఏ మాత్రం పరిపాలన సామర్ధ్యం లేకుండా అమ్మ .... అమ్మ.... అంటూ సోనియా భజన చేసే వీళ్ళా రేపు రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రజలకు మేలుచేసేది!