అమిత్ షా హెచ్చరికలు బాగానే పనిచేసినట్లున్నాయే
posted on Jan 17, 2015 9:02AM
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల పర్యటనకు వచ్చినప్పుడు ఆయన తన పార్టీ నేతలకు కార్యకర్తలకు చేసిన దిశానిర్దేశం గురించి వారు పట్టించుకొన్నారో లేదో తెలియదు గానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆయన చెప్పిన ఆ నాలుగు మంచి ముక్కలు బాగానే చెవికెక్కించుకొన్నట్లున్నారు. తెరాసకు ఒక లక్ష్యం కానీ బలమయిన పునాదులు గానీ లేవని, అది కేవలం ఒకరిద్దరు నాయకుల బలం మీద తెలంగాణా సెంటిమెంటు మీద ఆధారపడి మనుగడ సాగిస్తోందని, అటువంటి పార్టీని బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీ ఎన్నికలలో అవలీలగా ఓడించవచ్చని ఆయన చెప్పిన ముక్కలు కేసీఆర్ ని తట్టి లేపినట్లయింది. తమ పార్టీ గురించి అటువంటి మాటలన్నందుకు ఆయన బీజేపీకి శాపనార్ధాలు పెట్టినా అందులో నిజం ఉందని గ్రహించి తక్షణమే పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రారంభించడం విశేషం.
హైదరాబాద్ లో ఆయన నిన్న ఒక సమావేశం నిర్వహించి పార్టీ పటిష్ట పరిచేందుకు అవసరమయిన చర్యల గురించి పార్టీ నేతలతో చర్చించారు. త్వరలోనే గ్రామ స్థాయి నుండి కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు ప్రక్రియ, ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు పార్టీ ప్లీనరీ సమావేశాల నిర్వహణ, ఆ తరువాత ఏప్రిల్ 24న పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఒక భారీ బహిరంగ సభ నిర్వహణ, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్లకు జరుగబోయే ఎన్నికలకు పార్టీని సన్నధం చేయడం, ఇతర పార్టీల నుండి యం.యల్యే.లను, యం.యల్సీ.లను తెరాసలో జేర్చుకోవడం, పార్టీలో సీనియర్లకు సముచిత పదవులు ఇవ్వడం వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
తెలంగాణాలో పార్టీ చాలా బలంగా ఉన్నప్పటికీ ఖమ్మం, హైదరాబాద్ జంట నగరాలలో పార్టీ చాలా బలహీనంగా ఉన్నందున ఆ రెండు ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కేసీఆర్ వేర్వేరు వ్యూహాలు సిద్దం చేసారు. ఆ రెండు ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం, ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆకర్షించడం, ఖమ్మం జిల్లాలో రేపు ఆదివారంనాడు కేసీఆర్ పర్యటన చేయడం వంటి అనేక నిర్ణయాలు తీసుకొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలనే లక్ష్యంగా చేసుకొని ఇప్పటి నుండి పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీలో ప్రతీ ఒక్కరు గట్టిగా కృషి చేయాలని ఆయన హెచ్చరించారు.
ఒకవేళ కేసీఆర్ తన ఈ ప్రణాళికలన్నిటినీ నిఖచ్చిగా అమలుచేసినట్లయితే తెలంగాణాలో తెరాస మరింత బలపడే అవకాశం ఉంటుంది. అయితే ఆయన పార్టీని ఎంతగా బలోపేతం చేసుకొన్నప్పటికీ, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను కొన్నిటినయినా నెరవేర్చవలసి ఉంటుంది. అదే విధంగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న విద్యుత్ మరియు నీటి సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్ధంగా అమలుచేయవలసి ఉంటుంది. తెలంగాణా ప్రజలు ఆయనపై చాలా ఆశలు పెట్టుకొని అధికారం అప్పజెప్పిన సంగతి ఆయన సదా గుర్తుంచుకొంటూ వాటిని నెరవేర్చవలసి ఉంటుంది. అప్పుడే వచ్చే ఎన్నికలలో గెలుపు గురించి ఆలోచించవచ్చును. అమిత్ షా హెచ్చరికలకు కేసీఆర్ మేల్కొన్నట్లే ఉన్నారు. కానీ బీజేపీ నేతలు మేల్కొన్నారో లేదో?