టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్.. మరి దానం?
posted on Dec 3, 2015 @ 5:00PM
ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణగా తయారైంది. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి చాలామంది నాయకులే వేరే పార్టీల్లోకి మారారు. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. స్థానిక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ఇక అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. అయితే ఇప్పుడు అర్ధం కానీ పరిస్థితి ఏంటంటే ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరిపోయారు.. మరి ప్రభాకర్ కు అత్యంత సన్నిహితుడైన దానం నాగేందర్ ఇప్పుడు ఏం చేస్తారు అని.. టీఆర్ఎస్ లోకి చేరుతారా? లేదా అని అందరి సందేహం. ఇలా అందరూ సందేహ పడుతున్న సమయంలో దానం కేసీఆర్ ను కలిసిన వార్త బయటకి వచ్చింది. దీంతో ఇప్పుడు దానం కూడా తాను కేసీఆర్ ను కలిశానని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది చెప్పిన దానం తాను మాత్రం పార్టీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే దానం అలా చెబుతున్నా.. టీఆర్ఎస్ మాత్రం ఒకసారి ఫిక్స్ అయితే దానం గులాబీ గూటికి వెళ్లక తప్పదు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.