చేతులు కాలాక ఆకులు పట్టుకొంటున్న ఏపీయన్జీవోలు
posted on Dec 21, 2013 8:15AM
ఇంతకాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినే పూర్తిగా నమ్ముకొని అన్ని రాజకీయ పార్టీలను దూరంగా పెట్టిన ఏపీయన్జీవోలు, ఇప్పుడు ఆయన క్రమంగా స్వరం, దూకుడు రెండూ తగ్గించి డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టేసరికి వారి అగమ్యగోచరంగా మారింది. బహుశః అందుకేనేమో ఇప్పుడు వారు మెరుపు సమ్మెల గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. కానీ ముఖ్యమంత్రిని నమ్ముకొని ఇంతకాలం రాజకీయ పార్టీలను దూరంగా ఉంచడం తప్పనే సంగతి వారు చాలా ఆలస్యంగా తెలుసుకొన్నారు. అందుకే వారు శనివారం హైదరాబాదులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి సమైక్యాంధ్ర కోరుతున్న అన్ని పార్టీలను ఆహ్వానించారు. అయితే ఇది చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుంది.
ఇంతకాలం ప్రజాప్రతినిధులను తక్షణమే రాజీనామాలు చేయమంటూ హుకుంలు జారీచేస్తూ, వారి ఆగ్రహానికి గురయిన అశోక్ బాబు, ఇప్పుడు తెలంగాణా బిల్లు శాసనసభకు చేరుకొన్నతరువాత దానిని అడ్డుకొనేందుకు మళ్ళీ ఆ సీమాంధ్ర నేతల సహకారమే కోరడం విడ్డూరం. సమైక్యఉద్యమం ఉదృతంగా సాగుతున్న తరుణంలో ఆయన ఎవరినీ లెక్కచేయలేదు. ఒకవేళ అప్పుడు రాజకీయ పార్టీలను కలుపుకొనిపోయుంటే బహుశః నేడు పరిస్థితి ఇంకోలా ఉండేదేమో!
హైదరాబాదులో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను దిగ్విజయంగా నిర్వహించడంతో ఒక సమైక్యశక్తిగా ఎదిగిన అశోక్ బాబు, ఆ తరువాత ముఖ్యమంత్రి సలహా మీద ఉద్యమానికి ముగింపు పలకడంతో, రెండున్నర నెలల ఉద్యమంలో ఆయన సంపాదించుకొన్న గొప్ప పేరు ఒక్కసారిగా పోగొట్టుకొన్నారు. ముఖ్యమంత్రి కనుసన్నలలో నడిచే వ్యక్తిగా మిగిలిపోయారు. తదనంతరం డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చాలా జోరుగా సాగుతున్న సమయంలో కూడా, శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కదలదన్నట్లు, బహుశః ముఖ్యమంత్రి ఆజ్ఞ లేనందున ఆయన కూడా పూర్తిగా చల్లబడిపోయారు.
శాసనసభకి తెలంగాణా బిల్లు వచ్చిన మరుక్షణం మెరుపు సమ్మెకు దిగుతామని చెప్పుకొన్నఆయన, బిల్లు రావడం, సభలో ప్రవేశపెట్టడం జరిగిన తరువాత కూడా చేతలుడిగి చూస్తుండిపోవలసి వచ్చింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రమంగా అధిష్టానం చెప్పిన ప్రకారం నడుచుకోవడం మొదలుపెట్టిన తరువాత అశోక్ బాబుకి, ఆయన అనుచరులకి జ్ఞానోదయం అయింది.
టీ-యన్జీవోలు మొదటి నుండి అన్ని రాజకీయపార్టీలను కలుపుకొని ముందుకు సాగడం వలన వారిని ఎవరూ కన్నెత్తి చూడలేని శక్తివంతులుగా ఎదిగితే, కేవలం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రమే నమ్ముకొని, అన్ని రాజకీయ పార్టీలను దూరం చేసుకొన్న ఏపీఎన్జీవోలు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా హ్యాండ్ ఇవ్వడంతో శక్తి విహీనులయిపోయారు. అందుకే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుగా ఇప్పుడు రాజకీయపార్టీలను తమతో కలిసి పనిచేయమని, లేకుంటే వారే రాజకీయ జేఏసీ ఏర్పాటుచేస్తే దానికి తాము మద్దతు ఇస్తామని అర్దిస్తున్నారు.
అయితే పరిస్థితి ఇంతవరకు వచ్చిన తరువాత ఇప్పుడు ఈ ఆలోచన వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చును. మూడు కత్తులవంటి కాంగ్రెస్, వైకాపా, తెదేపాలను ఒకే ఒరలో ఇమడ్చాలాని ప్రయత్నిస్తే వారు మరో మారు అభాసుపాలుకాక తప్పదు. ఎందుకంటే వారు శాసనసభలో బయటా కూడా మీడియా సాక్షిగా ఏవిధంగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొన్నారో అందరూ ప్రత్యక్షంగా చూసారు. అటువంటి బద్ద రాజకీయ శత్రువులని ఒకచోట చేరిస్తే అఖిలపక్ష వేదికపై సమైక్యం కాదు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. అందువల్ల ఎపీఎన్జీవోలు ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలతో అదే దూరం పాటిస్తే, కనీసం ఉద్యోగులయిన సమైక్యంగా తమ సమస్యలకోసం పోరాడుకోవడానికి వీలుంటుంది. అలాకాదని అఖిలపక్ష సమావేశం తరువాత ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తే, ఉద్యోగులలో కూడా చీలికలు రావడం తధ్యం.