బీజేపీ పాలిత రాష్ట్రాలలో అగ్నిపథ్ మంటలపై మౌనమేల కిషన్ రెడ్డీజీ!
posted on Jun 17, 2022 @ 4:32PM
అగ్నిపథ్ మంటలు దేశమంతటా వ్యాపించాయి. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం అగ్నిపథ్ అంటూ ప్రకటన వెలువడిన క్షణం నుంచీ దేశంలో యువత రగిలిపోతున్నారు. వారి ఆందోళనలు హింసాత్మక రూపం దాలుస్తున్నాయి. వారి ఆవేదనను అర్ధం చేసుకుని, వారిని సముదాయించడానికి చర్యలకు ఉపక్రమించాల్సిన కేంద్రం మరింత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నది. అదలా ఉంచితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికిందరాబాద్ అల్లర్లపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అత్యంత బాధ్యతా రహితంగా ఉన్నాయి.
సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని అంటూనే కిషన్ రెడ్డి..ఈ అల్లర్లు అత్యంత పకడ్బందీగా ఒక పథకం ప్రకారం జరిగాయనీ, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేననీ అన్నారు. ఒక సీరియస్ సమస్యను రాజకీయ విమర్శలకు, ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకోవడమే దురదృష్టకరం. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కిషన్ రెడ్డి ఇటువంటి ప్రకటనలు, విమర్శలు చేయడం శోచనీయం అని పరిశీలకులు అంటున్నారు. సికిందరాబాద్ లో జరిగిన హింసాత్మక ఘటనలు ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదు. వాటిని నివారించడంలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాన్ని కూడా సమర్థించలేం. కానీ ఈ ఆందోళనలు ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ జరిగాయి. అక్కడా ఆందోళనలు హింసాత్మక రూపం జరిగాయి. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ హింసాత్మక ఘటనలు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం అయితే.. యూపీలో ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యమేనా? కిషన్ రెడ్డి ఆ విమర్శ చేస్తారా? చేయగలరా? తెలంగాణలో ఉన్నది బీజేపీయేతర ప్రభుత్వం కనుకే ఇక్కడ అల్లర్లు జరిగాయని సూత్రీకరించడం సమంజసమేనా? వాస్తవానికి ఆర్మీలో నియామకాలకు ‘అగ్నిపథ్’ అంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన క్షణం నుంచీ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలుచోట్ల రైళ్లను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా బీహార్ లో పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్ బల్లబ్ గఢ్ ప్రాంతంలో ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగారు. దీంతో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిపేశారు.
తమిళనాడులోనూ ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఇలా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరిగినా కిషన్ రెడ్డి కేవలం తెలంగాణలో మాత్రమే శాంతి భద్రతల వైఫల్యం అంటూ విమర్శలు గుప్పించడం రాజకీయం తప్ప మరోటి కాదని పరిశీలకులు అంటున్నారు. అల్లర్లు జరిగిన రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలూ ఉన్నాయని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.