తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ చెక్.. బహుముఖ వ్యూహాలతో బన్సల్ రెడీ
posted on Feb 27, 2023 @ 1:14PM
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి రాకుండా నియంత్రించడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి ఎలాగైనా రాష్ట్రంలో కమలం పార్టీ అధికార పగ్గాలు అందుకోవాల్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న బీజేపీ అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదలకుండా వ్యూహరచన చేస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ పకడ్బందీ వ్యూహాన్ని రచించారని పార్టీ శ్రేణులు అంటున్నారు.
రాష్ట్ర పార్టీలో అక్కడక్కడా వెలుగులోనికి వస్తున్న విభేదాలను పరిష్కరించి.. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సమన్వయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. పార్టీలోనే ఉంటూ పెద్దగా క్రియాశీలంగా లేని నాయకులను మళ్లీ చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడంపై ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందుబాటులోకి రాకుండా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న బీజేపీ నేతల జాబితాను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రెడీ చేశారని అంటున్నారు.
వారందరినీ తిరిగి క్రియాశీలంగా మార్చడమే టాస్క్ గా ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారని అంటున్నారు. ఒక వైపు పార్టీ శ్రేణులను నిరంతరం క్రియాశీలంగా ఉంచుతూ.. వరుస కార్యక్రమాలతో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ఆయనకు తోడుగా పార్టీ సీనియర్లందరినీ ఏకతాటిపై నడిపించడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ప్రజా గోస- బీజేపీ భరోసా పేరిట బైక్ ర్యాలీలు చేపపట్టిన బీజేపీ.. పార్లమెంటరీ ప్రవాస్ యోజన పేరిట కేంద్ర మంత్రుల పర్యటనలకు షెడ్యూల్ ఖరారు చేస్తున్నది. అదే సమయంలో పార్టీ శ్రేణులకు ప్రజలతో మమేకం కావడంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. తాజాగా కార్నర్ మీట్ లతో ప్రజలకు చేరువ అవుతోంది. ప్రస్తతం తెలంగాణ పర్యటనలో ఉన్న సునీల్ బన్సల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నాయకులతో వరుస భేటీలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.