కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే
posted on Oct 19, 2012 @ 3:39PM
కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే అనే రాజకీయ విశ్లేషకులు రాజనీతికోవిదులే కాదు సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ కామన్వెల్త్ 2 జి, కోల్ కుంభకోణంలో తంటాలు పడుతుంటే కొత్తగా పార్టీ నాయకురాలి అల్లుడైన రాబర్ట వాద్రా అకస్మాత్ గా మల్టీ బిలియనీర్ ఎలా అయ్యారో కేజ్రీవాల్ గుట్టు విప్పేసారు. దాంతో కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతుంది. పోనీ బిజెపి కి ఈసారి ఓట్లేద్దామనుకుంటే కర్నాటక అసెంబ్లీలోకరువు గురించి చర్చలు జరుగుతుంటే సదరు బిజెపి సభ్యులు సెల్ ఫోన్లలో బ్లూ ఫిలింలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ విలేకరులకు దొరికి పోయారు. దేశం అంతటా పెద్ద దూమారం లేసింది. అయినా సదరు సభ్యులను పార్టీనుండి సస్పెండ్ చేయలేదు. మైనింగ్ మాఫియా డాన్ అయిన గాలిజనార్ధన్ కర్నాటకలో బిజెపికి 50 సీట్లు గెలిపించి పెట్టారు. ప్రస్తుతానికి ఆయన చెంచల్ గూడ జైల్లో ఉన్నారు. అలాగే కేజ్రీవాల్ తాజాగా చేసిన ఆరోపణలు కూడా ప్రజల్ని తెల్లబొయేలా చేసింది. గడ్గారీ మహారాష్ట్ర గవర్నమెంటునుండి అధికంగా సంపాదించిన ఆరున్నర ఎకరాల భూములు చట్టబద్దంగా వచ్చాయని అరుణ్ జైట్లీ చెప్పటం నిజమే కావచ్చు. కానీ అవకాశం వచ్చిందికదా అని తీసుకోవడం కరెక్టు కాదుకదా... అవన్నీ పనికి రాని భూములని బిజెపి నేతలు చెబుతున్నా దాంట్లో చెరకు పంట పండించడంతో ఆవాదన కరెక్టు కాదని తెలుస్తుంది. కుంభకోణాల్లో మునిగిని యుపిఎ 2 రాజీనామా చేయాలని పార్లమెంటును బిజెపి కుదిపేస్తే, అవినీతి పరులు రాజకీయాలనుండి వైదొలగాలని కర్నాటకలో సోనియా కోరారు. దేశానికి చెందిన రెండు జాతీయ పార్టీలు బురదలో మునిగిపోయి సోనియా చెబుతున్నట్లు ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటేయాలో తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.