సమైక్యవాదమే ఆయుధంగా ప్రత్యర్ధులపై జగన్ పోరాటం
posted on Dec 26, 2013 @ 5:54PM
జగన్మోహన్ రెడ్డి తానొక్కడే అసలు సిసలయిన సమైక్యవాదినన్నట్లు, మిగిలినవారెవరికీ కూడా రాష్ట్రం విడిపోతోందనే బాధ లేదన్నట్లు మీడియా ముందు తెగ ఫీలయిపోతూ నటించేస్తుంటారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తను చేస్తున్న పోరాటంలో అన్నిరాజకీయ పార్టీలు, నేతలు కూడా తన వెనుకే నడవాలని, తను చెపుతున్నట్లు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. అందరూ తను చెపుతున్నట్లు చేయకపోతే చరిత్ర హీనులయి పోతారంటూ శపిస్తుంటారు కూడా. అందుకే ఓసారి రాజీనామాలు, మరోసారి అఫిడవిట్లు అంటూ ఏదో ఒక డ్రామాలాడుతూ తెదేపాను కూడా తనలాగ చేసి చూపించమని లేకుంటే సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేసినట్లేనని వాదిస్తుంటారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తనకు వచ్చిన, నచ్చిన ఐడియాను ఆయన తనపార్టీ చేత నిరభ్యంతరంగా అమలు చేసుకోవచ్చును. కానీ, దానిని ఇతర పార్టీలు కూడా అనుసరించాలని లేకుంటే చరిత్ర హీనులేనని వాదించడమే విడ్డూరం. అసలు తను చెప్పినట్లు ఇతర పార్టీలు, నేతలు వినాలని ఆయన ఏవిధంగా ఆశిస్తున్నారు?
ఎవరి సంగతెలా ఉన్న ముందుగా చంద్రబాబుని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం ఆయన శపించడం మరిచిపోరు. కారణం సీమాంధ్రలో వారిరురితోనే ఆయన ఎన్నికలలో పోటీపడవలసి ఉంటుంది గనుక. కానీ తెలంగాణాకే పరిమితమయిన తెరాసతో తనకి ఎటువంటి సమస్య లేదు గనుక రాష్ట్ర విభజనకి మూలకారకుడయిన తెరాస అధినేత కేసీఆర్ గురించి మాత్రం ఎన్నడూ ఎటువంటి విమర్శలు చేయరు. వైకాపా దృష్టి అంతా సీమాంధ్ర పైన మాత్రమె ఉందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది?
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నానని స్వంత డప్పువేసుకొనే జగన్మోహన్ రెడ్డి, మరి తెలంగాణా ప్రాంతంలో కూడా విస్తృతంగా పర్యటించి రాష్ట్రం విడిపోతే వచ్చేకష్టనష్టాలను అక్కడి ప్రజలకి, పార్టీలకీ కూడా వివరించి వారిని కూడా రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ఒప్పించే ప్రయత్నం చేయకుండా, కేవలం సీమాంధ్రలో మాత్రమే ఎందుకు శంఖం ఊదుకొంటూ, ఓదార్పులు చేసుకొంటూ తిరుగుతున్నారో గమనిస్తే ఆయన అంతర్యం ఏమిటో అర్ధం అవుతుంది.
నిజానికి సమైక్యాంధ్ర అనేది తను అధికారంలోకి రావడానికి ఉపయోగపడే ఒక మంచి ఆయుధంగా జగన్ భావిస్తునందునే, ఆ సెంటిమెంటు బలంగా ఉన్నచోటనే ఆయన తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తపన కంటే, సమైక్యాంధ్ర ఉద్యమాన్నిఆయుధంగా చేసుకొని తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలనే తపన చూస్తే ఆయన అంతర్యం ఇట్టే అర్ధం అవుతుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అందరినీ జెండాలు పక్కన బెట్టి వచ్చితన వెనుక నడవమని ఆదేశించే జగన్మోహన్ రెడ్డి, మొన్నఏపీయన్జీవోలు సమైక్యాంధ్ర సాధన కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఏవో కుంటి సాకులు చెప్పిహాజరవకుండా తప్పించుకోవడం చూస్తే ఆయన సమైక్యవాదం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది.
తెదేపాతో బాటు వైకాపా కూడా రాష్ట్రవిభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ఆవిధంగా లేఖ ఇవ్వడం పొరపాటయిందని కానీ, దానిని తాము వెనక్కు తీసుకొంటున్నామని గానీ ఎన్నడూ అనకపోయినా, తెదేపా ఇచ్చిన లేఖ గురించి మాత్రం పదేపదే ప్రస్తావిస్తూ దానిని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయడం చూస్తే, ఆయన చేస్తున్న ఈ రాజకీయమంతా దేని కోసమో అర్ధం అవుతుంది.
జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఉండటం తప్పుకాదు, నేరమూ కాదు. అదేవిధంగా తన పార్టీ వచ్చేఎన్నికలలో గెలవాలని ఆయన కోరుకోవడం కూడా నేరం కాదు. అయితే మనసులో రాష్ట్ర విభజన కోరుకొంటూ, సీమాంధ్ర ప్రజల ఓట్లు రాల్చుకోవడానికి పైకి సమైక్యవాదం చేయడం క్షమార్హం కాదు. సీమాంధ్ర ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్నమాట నూటికి నూరు పాళ్ళు వాస్తవమే. కానీ వారి భావోద్వేగాలను వారి బలహీనతగా భావించి ఈవిధంగా రాజకీయాలు చేస్తే ప్రజలు అందుకు తగిన గుణపాటం చెప్పడం ఖాయం.