చిక్కుల్లో రోజా.. షాకిచ్చేందుకు సిద్ధమైన జగన్!?
posted on Mar 6, 2024 8:43AM
ఏపీ మంత్రి రోజా.. ఈ పేరు వినగానే మహిళల నుంచి సైతం ఛీదరింపులు ఎదురవుతాయి.. అభ్యంతరకర భాషతో ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడటం ద్వారా జగన్ మొప్పు పొందాలన్న ఆరాటం సామాన్య జనంలో రోజా పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రోదికావడానికి కారణమైంది. రాజకీయ బిక్షపెట్టిన పార్టీని, పార్టీ అధినేతను, వారి కుటుంబంలోని సభ్యులపై సైతం రోజా అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు గుప్పించారు. రోజా ప్రెస్‌మీట్ అంటేనే పలువురు తమ ఇళ్లలో టీవీలు బంద్ చేసుకొనే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు.
సినీ హీరోయిన్‌గా తెలుగు ప్రజల్లోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా.. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ పార్టీలో మహిళా నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా.. ప్రజా సమస్యల పరిష్కారంకోసం కృషిచేశారు. అయితే వైసీపీలో చేరిన తరువాత.. ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అనుచిత భాష వాడుతూ ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. రోజా భాష, ఆమె ప్రతిపక్ష నేతల పట్ల ప్రవర్తించే తీరును ఏపీలోని మెజార్టీ మహిళలు ఛీదరించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ తరపున రోజా సెల్వమణి రెండు సార్లు వరుసగా నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014లో వైసీపీ ప్రతిపక్షంలో కొనసాగగా.. 2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్ లో రోజాకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ, జగన్ తొలి క్యాబినెట్‌లో ఆమెకు అవకాశం ఇవ్వలేదు. దీంతో పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరించారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆమెను కేబినెట్ లోని తీసుకుని పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. వైసీపీలో అభ్యంతరకర భాషను వాడే లీడర్లలో రోజా ముందువరుసలో ఉంటారన్న పేరు సొంతం చేసుకున్నారు.
ఇక రోజా రెండో దఫా విజయం సాధించిన తరువాత నగరి నియోజకవర్గంలో ఆమె అవినీతి అక్రమాలకు పెద్దెత్తున పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. ఆమె సోదరులు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని నియోజకవర్గ ప్రజలే ఆగ్రహంతో ఉన్నారు. రోజా తీరుపై నియోజకవర్గ ప్రజలతోపాటు, సొంత పార్టీ నేతలుసైతం బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈదఫా ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ అధిష్టానం ఇప్పటికే తొమ్మిది సార్లు పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చుతూ లిస్టులను విడుదల చేసింది. ఈ తొమ్మిది జాబితాల్లో రోజా పేరు లేకపోవటంతో నగరి నియోజకవర్గ వైసీపీలోని రోజా వ్యతిరేకులు అధిష్టానం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజా పరిణామాల నేపథ్యంలో రాబోయే జాబితాల్లో రోజా సీటు చిరగడం ఖాయమని వైసీపీ నేతులు పేర్కొంటున్నారు.
రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నుంచి రోజా నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలను విస్మరిస్తూ వచ్చారు. కేవలం తన సోదరులతో నియోజకవర్గంలో దోపిడీకి పాల్పడటమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. దీంతో నియోజకవర్గంలోని సగం మందికిపైగా వైసీపీ నేతలు మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో రోజాపై పలు సార్లు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీలోని వ్యతిరేకులను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సింది పోయి.. వారిని మరింత దూరం చేసుకుంటున్నారు రోజా.. మరో అడుగు ముందుకేసి రోజా భర్త సెల్వమణిసైతం రంగంలోకి దిగారు. రోజాపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై సెల్వమణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుక్కల్లా మొరుగుతున్నారని ఆయన తమిళంలో తిట్టారు. దీంతో నగరిలోని ఐదు మండలాలకు చెందిన వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి రోజాపై పైర్ అయ్యారు. నగరి నియోజకవర్గంలో భూకబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు ఇలా ఒక్కటేమిటి.. రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. మంత్రి రోజా అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
రోజాపై నియోజకవర్గంలో ప్రజల నుంచేకాక సొంత పార్టీ నేతల నుంచిసైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో వైసీపీ అధిష్టానం నగరిపై దృష్టిసారించింది. పలు దఫాలుగా రోజా విజయావకాశాలపై సర్వేలు నిర్వహించగా.. ఆమె ఓటమి ఖాయమని తేలిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలకాకమునుపే రోజాను కాదని వేరేవారిని నగరి నియోజకవర్గ ఇంచార్జిగా నియమిస్తే రాష్ట్రం వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే.. ప్రతిపక్షాలపై అభ్యంతరకర భాషతో విరుచుకుపడే వారిలో కొడాలి, రోజా ప్రముఖులు. వీరిని జగన్ దగ్గరి వ్యక్తులుగా వైసీపీ శ్రేణులు భావిస్తాయి. అయితే జగన్ నిర్వహించిన సర్వేల్లో వీరిద్దరూ ఓడిపోతారని తేలడంతో ముందస్తుగా వారి నియోజకవర్గాల్లో ఇంచార్జిలను నియమిస్తే పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు అధిష్టానం భావిస్తోంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత, నామినేషన్ల దాఖలుకు గడువు సమీపించిన సమయంలో నగరి, గుడివాడ నియోజకవర్గాల్లో రోజా, కొడాలి నాని స్థానంలో కొత్తవారికి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందని పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి రోజాకు ఈసారి వైసీపీ టికెట్ దక్కడం దాదాపు అసాధ్యమనేనని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. జగన్ టికెట్ నిరాకరిస్తే రోజా ఎలా రియాక్ట్ అవుతారనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.