గులాబీ పార్టీలో టికెట్ల పంచాయతీ
posted on Dec 28, 2022 @ 2:04PM
అధికార బీఆర్ఎస్ లో టికెట్ల పంచాయతీ మొదలైంది. అవును... అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొంత సమయం వుంది. పైగా పార్టీ అధ్యక్షడు ముఖ్యమంత్రి కేసేఆర్, సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు అందరికీ టికెట్ ఖాయమని ప్రకటించారు. అయితే సిట్టింగులు అందరికీ తరిగి టికెట్ ఇస్తారా లేక ఆఖరి క్షణంలో గెలుపు గుర్రాలు తెర మీదకు వస్తాయా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. అలాగే ఇతర పార్టీల టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న 16 ( కాంగ్రెస్ 12, టీడీపీ 2, ఇండిపెండెంట్ 2) ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒరిజినల్ బీఆర్ఎస్ ( టీఆర్ఎస్)లకు టికెట్లు ఇస్తారా, వలస వాదులకు పెద్దపీట వేస్తారా అనే మరో చర్చ కూడా ఇటు పార్టీలో, అటు మీడియాలో జరుగుతోంది. అలాగే మారిన రాజకీయ, కుల సమీకరణల కారణంగా మరొ కొన్ని స్థానాల్లో అభ్యర్ధులను మార్చ వలసి ఉంటుందని అంటున్నారు. సో.. ముఖ్యమంత్రి పార్టీ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినా, సిట్టింగ్ ఎమ్మెల్యేలలోనూ ఎవరికుండే అనుమానాలు వారి కున్నాయి. అందుకే, అలా అనుమానాలున్న ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే సీటు పదిలం చేసుకునే ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ టికెట్ల వ్యవహారం అలా, ఉంటే వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు ముందే శాసనమండలిలో ఏడు సీట్లు ఖాళీ కానున్నాయి. మూడు ఎమ్మెల్యే కోటా సీట్లు, ఒక హైదరాబాద్ టీచర్స్ కోటా సీటు కాల పరిమితి మార్చి 29తో ముగియనుంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు సహా ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే షురూ అయింది. గవర్నర్ కోటాలో రెండు, హైదరాబాద్ లోకల్ బాడీస్‌లో ఒక సీటు మే 27న ఖాళీ అవుతాయి. ఖాళీ అయ్యే ఏడుసీట్లలో ఒక్క టీచర్స్ సీట్ తప్ప మిలిన అన్ని స్థానాల్లో నూటికి నూరు శాతం గెలుపు అవకాశాలు అధికార బీఆర్ఎస్ కే ఉన్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీ సీటు ఫలితం మాత్రమే ఉపాధ్యాయులనిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.
కాగా ఎమ్మెల్యే కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణా రెడ్డి, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన రాజేశ్వర్ రావు, ఎంఏ ఫారూఖ్ హుస్సేన్, టీచర్స్ కోటాలో ఎన్నికైన కాటేపల్లి జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ స్థానిక సంస్థల (లోకల్ బాడీ) కోటాలో ఎన్నికైన ఎంఐఎం నేత సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ కాల పరిమితి కొత్త ఏడాదిలో ముగియనుంది. ఖాళీ కానున్న సీట్ల కోసం గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. మునుగోడు బైపోల్‌కు ముందు పార్టీలో చే రిన వారితో పాటు గతంలో కేసీఆర్ కేటీఆర్ హామీ ఇచ్చిన సుమారు యాభై అరవై మంది వరకు నేతలు ఆశలు పెట్టుకున్నారు.
కాల పరిమితి ముగిసే ఎమ్మెల్సీల్లో నవీన్ కుమార్‌కు మళ్లీ చాన్స్ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. గవర్నర్ కోటాలో మైనార్టీ వర్గాలకు చెందిన రాజేశ్వర్ రావు, ఫారుఖ్ హుస్సేన్ ఎమ్మెల్సీ కాల పరిమితి ముగియనుంది. ఆ ఇద్దరికి కూడా రెన్యూవల్ అయ్యే అవకాశముందని ప్రచారం నడుస్తున్నది. ఇతర సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే క్రిస్టియన్, ముస్లిం మతాలకు చెందిన ఇతర నేతల పేర్లు పరిశీలించే అవకాశమున్నట్టు సమాచారం. హైదరాబాద్ స్థానిక సంస్థల (లోకల్ బాడీ) కోటా స్థానాన్ని ఎంఐఎంకే ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కాటేపల్లి జనార్దన్ రెడ్డిని బీఆర్‌ఎస్ బలపరుస్తున్నది.
ఇకపోతే ఎమ్మెల్యే కోటాలోని మిగతా రెండు సీట్ల కోసం బీఆర్ఎస్ లో భారీ ఎత్తున పోటీ ఉంది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు పార్టీలో చేరిన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మరో నేత పల్లె రవి కుమార్‌కు మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశమిస్తామని కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టికెట్ ఇవ్వలేకపోయిన సుమారు 30 మంది నేతలకు మండలి లేదా రాజ్యసభలో అవకాశం కల్పిస్తామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఇంకో 15 మంది నేతలకూ ఇలాంటి హామీలే ఇచ్చారు. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మండలి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
అసెంబ్లీకి వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. 40 నియోజకవర్గాల్లో ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేని నేతలను అంతకన్నా ముందే ఖాళీ అయ్యే మండలి స్థానాలతో అడ్జస్ట్ చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఇలా ఏ ఈక్వేషన్ చూసుకున్నా రెండు, మూడు సీట్లకు మించి అవకాశం లేదు. ఉన్న ఈ రెండు, మూడు సీట్లను 50 మంది వరకు నేతలు ఆశిస్తుండటంతో ఎవరిపై కేసీఆర్ కరుణ చూపుతారు, ఎవరికి చాన్స్ ఇస్తారనేది అంతుచిక్కడం లేదు. ఇక్కడ చాన్స్ రాని నేతలు బీజేపీ, టీడీపీ సహా ఇతర పార్టీల్లో చేరితే కారు పార్టీకి ఎన్నికల్లో నష్టం తప్పదని ఆ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లీడర్లను కేసీఆర్ ఎలా సంతృప్తి పరుస్తారు.. పార్టీని వీడకుండా వారికి ఎలాంటి ఆశ చూపిస్తారనే దానిపైనా పార్టీలో రకరకాల చర్చలు సాగుతున్నాయి.