దేశంలో నైనిటాల్ కంటే చల్లని ప్రదేశం ఎదో తెలుసా?
posted on Dec 28, 2022 @ 1:15PM
దేశంలో అత్యంత చల్లనైన ప్రదేశం ఏది అని అడిగితే ఎవరైనా ఠక్కున నైనిటాల్ అని చెప్పేస్తారు. అయితే ఈ ఏడాది చలి పులి కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఇప్పుడు దేశంలో నైనిటాల్ కాదు ఢిల్లీయే అత్యంత చల్లని ప్రదేశం అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మంగళవారం (డిసెంబర్ 27)హస్తినలో కనిష్ట ఉష్ణోగ్రత 5.6 డిగ్రీలుగా నమోదైంది. బుధవారం ఉదయం ఇది 7 డిగ్రీలుగా ఉంది. శీతల గాలులతో హస్తినలో చలి వణికించేస్తోంది. దట్టమైన పొగమంచు నగరాన్ని దుప్పటిలా కప్పేసింది.
దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మొత్తంగా ఉత్తర భారతం అంతా చలిగుప్పిట్లో చిక్కుకుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. మరో 48 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.