మహారాష్ట్ర, కేరళలో కరోనా విజృంభణ.. వైద్య వర్గాల్లో ఆందోళన
posted on Jul 13, 2021 @ 11:03AM
దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కాస్త తగ్గింది. రోజువారి కేసులు 40 వేల దిగువకు పడిపోయాయి. హమ్మయ్య అని ఊపిరీ పీల్చుకుంటున్నారు. అంతలోనే మరో డేంజర్ బెల్స్. జూన్ లో తగ్గినట్లు కనిపించిన కొవిడ్ కేసులు.. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ పెరగడం కలవరం కల్గిస్తోంది. తాజాగా నమోదవుతున్న కేసులతో దేశంలో థర్డ్ వేవ్ మొదలైందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర, కేరళలో నమోదైన కేసుల సంఖ్యను గమనిస్తుంటే ఈ అనుమానం బలపడుతుందని వైద్య వర్గాలే చెబుతున్నాయి.
కేరళలో గడచిన పదిరోజుల్లో సుమారు 1.5 లక్షల కరోనా వైరస్ కేసులు వెలుగుచూశాయి. మహరాష్ట్రలో 95 వేల కేసులు నమోదయ్యాయి. జూన్ చివరి నెలలో కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి జూలై 1వ తేదీనుండి మళ్ళీ పెరిగిపోతుండటం రాష్ట్రప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో జూలై మొదటి 11 రోజుల్లో 88,130 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత రెండు వేవ్ ల ఉధృతితో పోలిస్తే.. ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు మహారాష్ట్రలో జూలైలో నమోదైన కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందని, వివిధ జిల్లాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయని చెప్పారు. ఇది మహారాష్ట్ర, ముంబై లో థర్డ్ వేవ్ రానున్నదని చెప్పడానికి సంకేతమని వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం లాక్ డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడమే అంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేయగానే జనాలు పోలోమంటు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మనదేశంలో భౌతిక దూరం పాటించటం సాధ్యంకాదు. జనాల్లో చాలామంది కనీసం నోటికి మాస్కు కూడా పెట్టుకోకుండానే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. శానిటైజర్లు వాడకుండానే అందరినీ ముట్టేసుకోవటం, హ్యాండ్ షేక్ చేయటం చేస్తుండటంతో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. దీనికితోడు దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కూడా అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో జనాలంతా అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు చేస్తున్నారు వైద్య నిపుణులు.