ఆర్టీసీ మూసివేతే ...సమ్మెకు ముగింపా? కార్మికులకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
posted on Oct 25, 2019 @ 11:21AM
ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మె మొదలైన తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడిన కేసీఆర్... తిన్నది అరక్క చేస్తున్న పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూనియన్ ఎన్నికల్లో గెలుపు కోసమే ...చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ మూసివేతే.... సమ్మెకు ముగింపేమో అంటూ హెచ్చరించారు. 4ఏళ్లలో 67శాతం జీతాలు పెంచాక కూడా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని మండిపడ్డారు. ఆర్టీసీని ఎవరూ కాపాడలేరన్న కేసీఆర్... ఇక సంస్థ మునిగిపోయినట్లేనని అన్నారు. ఆర్టీసీ విలీనం ఓ పిచ్చి డిమాండ్ అన్న కేసీఆర్..... ప్రైవేట్ ట్రావెల్స్‌కు, అద్దె బస్సులకు లాభాలు వస్తుంటే... ఆర్టీసీకి మాత్రం ఎందుకు నష్టాలు వస్తున్నాయంటూ ప్రశ్నించారు.
ఆర్టీసీ యూనియన్లవి అర్ధంపర్ధంలేని... అసంబద్ధమైన... దురంహకారపూరితమైన డిమాండ్లు అన్నారు కేసీఆర్. ఆర్టీసీపై తనకంటే ఎవరికీ ఎక్కువ అవగాహన లేదన్న కేసీఆర్.... 1997లో రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కష్టపడి సంస్థను లాభాల్లో తెచ్చానని గుర్తుచేశారు. ఇక, ఇప్పుడు నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ కార్మికుల జీతాలను 67శాతం పెంచామన్న కేసీఆర్.... దేశంలో ఏ రాష్ట్రమైనా అలా చేసిందా అంటూ ప్రశ్నించారు. ఎవరు బడితే వాళ్లు రోడ్లపైకి వచ్చి ఆర్టీసీని ప్రభుత్వంలో కలపమంటే కలిపేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మొత్తం 57 కార్పొరేషన్లు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రభుత్వంలో కలపమంటే కుదురుతుందా అన్నారు. అసలు విలీనమనేది తెలివి తక్కువ... అసంభవమైన నినాదమన్నారు.
ఆర్టీసీ ఇక బతికి బట్టకట్టదని, సంస్థను ఎవరూ కాపాడలేరన్న కేసీఆర్... కార్మికుల జీవితాలతో యూనియన్లు ఆడుకుంటున్నాయని ఆరోపించారు. అలాగే, వెయ్యికి వెయ్యి శాతం ఇప్పుడున్న ఆర్టీసీ ఉండే అవకాశమే లేదన్నారు. యూనియన్లు లేకపోతే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్న కేసీఆర్.... ఐదారు రోజుల్లో 7వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు చెప్పింది కాబట్టి... కార్మికులతో చర్చలుంటాయని స్పష్టతనిచ్చిన కేసీఆర్.... ముఖ‌్యమంత్రినే తిడుతూ డిమాండ్లు సాధించుకోలగరా? అంటూ యూనియన్ లీడర్లపై ఫైరయ్యారు. నిజంగా కార్మికులు అమాయకులైతే డిపోల్లో దరఖాస్తు చేసుకుని రీజాయిన్ కావాలంటూ కేసీఆర్ మరోసారి ఆఫర్ ఇచ్చారు.