త్వరలో సోము వీర్రాజు అవుట్! సీనియర్లకు హైకమాండ్ సిగ్నల్
posted on Mar 11, 2021 @ 3:53PM
సోము వీర్రాజు పని అయిపోయిందా? ఏపీ బీజేపీకి కొత్త సారథి రానున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సోము వీర్రాజు తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ హైకమాండ్.. ఆయన స్థానంలో మరొకరికి ఏపీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ బీజేపీ సీనియర్ నేత , మాజీ కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు హైకమాండ్ కు రాసిన లేఖ కలకలం రేపుతోంది. సోము వీర్రాజును మారిస్తే, ఆ స్థానాన్ని తనకు ఇవ్వాలని కోరుతూ సన్యాసిరాజు పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కష్టపడి పని చేస్తున్న తనకు పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని తన లేఖలో కోరారు. సన్యాసి రాజు రాసిన లేఖ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సోము వీర్రాజుకు చెక్ పడనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సోము వీర్రాజును మారుస్తున్నారనే చర్చ బీజేపీ వర్గాల్లో చాలాకాలం నుంచి జరుగుతోంది. వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టాక, పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. వైసీపీతో పోరాడటంలో విఫలమయ్యారని, సీనియర్లను మీడియా ముందుకు వెళ్లకుండా ఆంక్షలు విధించారని, అసలు పార్టీ అంతా నలుగురికే పరిమితమయిందన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ సర్కార్ పై విమర్శలు చేయకుండా.. వారికి మద్దతు ఇచ్చేలా సోము టీమ్ పని చేస్తుందనే ఆరోపణలు బీజేపీ నేతలే అంతర్గతంగా చేస్తున్నారు. సోము తీరుపై ఇప్పటికే కొంత మంది నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆయనతో లాభం లేదనుకున్న పార్టీ నాయకత్వం, కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది.
తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని లేఖ రాసిన సీనియర్ నేత సన్యాసిరాజుపై, పార్టీ సహ ఇన్చార్జి సునీల్ దియోథర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆవిధంగా పార్టీ నాయకత్వానికి లేఖ ఎలా రాస్తారని, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో సస్పెండ్ చేస్తానని హెచ్చరించగా, తాను పార్టీ సీనియర్ కార్యకర్తనని, తననే బెదిరిస్తే సహించేలేదని సన్యాసిరాజు కూడా గట్టిగా జవాబు ఇచ్చినట్లు సమాచారం.
పార్టీ కార్యకర్తగా నాయకత్వానికి లేఖ రాసే అధికారం, స్వేచ్ఛ తనకు ఉందని సన్యాసి రాజు చెబుతున్నారు. సోము వీర్రాజును మారిస్తేనే తనకు ఇవ్వాలని కోరానే తప్ప, ఆయనను తొలగించాలని కోరలేదన్నారు. తాను ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, హరిబాబు, కన్నా అధ్యక్షులుగా ఉన్న కమిటీలో పనిచేసిన సీనియర్ నాయకుడినని గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నాయకత్వ పనితీరు గురించి తాను చెప్పనవసరం లేదని, నాయకత్వానికి అన్నీ తెలుసన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని, తన మాదిరిగానే లక్షలాదిమంది కార్యకర్తల కోరిక కూడా అదేనన్నారు. తాము వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడితేనే మరింత బలపడతామని అభిప్రాయపడ్డారు. అయితే ఇది మీడియాకు ఎలా లీక్ అయిందో తనకు తెలియదని, తనంటే గిట్టనివారెవరో దానిని లీక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
మొత్తానికి పార్టీ హైకమాండ్ కు సన్యాసిరాజు రాసిన లేఖ బీజేపీలో సంచలనంగా మారంగా.. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోముకు చెక్ పడటం ఖాయమని... ఆయన వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది.