టీ-బిల్లుని ఎండగట్టిన ముఖ్యమంత్రి
posted on Jan 25, 2014 @ 1:04PM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా బిల్లుపై ఈరోజు శాసనసభ లో జరుగుతున్నచర్చసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేసేందుకు బిల్లు రూపొందిస్తున్నపుడు అందులో తప్పనిసరిగా పేర్కొనవలసిన అనేక అంశాలను కేంద్రం, హోంశాఖ పూర్తిగా విస్మరించాయని, కనీసం ఆ వివరాలను కోరినప్పుడయినా పొంతనలేని సమాధానాలు చెపుతూ ఇవ్వడానికి నిరాకరించిందని కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగంలో సూచించిన కొన్నినియమాలను చదివి వినిపించి, కేంద్రం కనీసం రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా నయినా బిల్లు రూపొందించలేకపోయిందని ఆక్షేపించారు.
ఒక రాష్ట్రాన్ని విభజిస్తున్నపుడు దానివలన రెండు ప్రాంతాలకు, ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలుగుతుందో, విభజనకు కేంద్రం ఏవిధమయిన ఏర్పాట్లు చేస్తోందో, అందులో ఇమిడి ఉన్నఅనేక ఆర్ధిక అంశాలను ఏవిధంగా పరిష్కరించబోతోందో, నిధులను ఏవిధంగా సమకూర్చదలచుకొందో వంటి ముఖ్యమయిన వివరాలను బిల్లులో పొండుపరచకుండా, చేస్తాం, చూస్తాం, ఆలోచిస్తాం, పరిశీలిస్తాం అంటూ చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిందని తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్రం తనేవిధంగా రాష్ట్ర విభజన చేయదలచుకున్నదీ వివరించకుండా, ఇటువంటి అసమగ్రమయిన బిల్లుని శాసనసభకి పంపితే తాము దానిపై ఏవిధంగా చర్చించగలమని ఆయన ప్రశ్నించారు. అసలు ఇది బిల్లా లేక ముసాయిదా బిల్లో కూడా తెలియని పరిస్థితని ఆయన ఆక్షేపించారు.