తెలంగాణా ఏర్పాటుకి తెరాస విలీనంతో లంకె ఉందా
posted on Jan 25, 2014 @ 11:04AM
రాష్ట్ర విభజనతో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను దెబ్బతీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే కారణంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతల తిరుగుబాటుని, ప్రజలలో వ్యతిరేఖతని ఎదుర్కోకతప్పడం లేదు. అయితే ఇది కూడా ప్రతిపక్షాలను ఏమార్చడానికి వేసిన ఎత్తుగడ అయినా ఆశ్చర్యం లేదు. ఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేస్తామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేస్తున్నకారణంగా అభ్యర్ధులను ఖరారు చేయలేకపోతుంటే, తెరాస తమతో విలీనం అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉండటం వలన తెలంగాణాలో అభ్యర్ధులను ఖరారు చేయలేకపోతోంది. అందువల్ల సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డో మరొకరో కొత్తపార్టీ స్థాపించిన తరువాత, పార్టీలో ఇంకా ఎంత మంది మిగులుతారో లెక్కలు సరిచూసుకొని అప్పుడే తన అభ్యర్ధులను ప్రకటించవచ్చును.
అదేవిధంగా తెలంగాణాలో తెరాసతో పొత్తులు, విలీనం లెక్కలు తెలితేగానీ, ఆ రెండు పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించలేవు. తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు డిశంబర్ రెండవ వారంలోనే తమ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటిస్తానని గతంలో చెప్పినప్పటికీ ఇంతవరకు ప్రకటించలేకపోవడానికి కారణం కూడా బహుశః ఇదే అయిఉండవచ్చును. ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో చేతులు కలుపుతాయా లేదనే సంగతి పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టిన తరువాతనే తేలవచ్చును.
అయితే, వచ్చేఎన్నికలలో తెరాసకే మెజార్టీ రావచ్చని సర్వేలు స్పష్టం చేస్తుండటంతో, తెలంగాణా బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తెరాస కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు ఇష్టపడకపోవచ్చును. అదే జరిగితే, రాష్ట్ర విభజన చేసి రెండు ప్రాంతాలలో లబ్ది పొందాలని ఎత్తువేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కూడా ఘోరంగా దెబ్బతినడం ఖాయం. ఒకవేళ ఎన్నికలలోగా కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ, ఆ క్రెడిట్ మొత్తం తెరాస ఎత్తుకుపోవడం ఖాయం. ఎందుకంటే, వచ్చే ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది గనుక, దానిని, తెరాసను తట్టుకొని కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదు. గనుక, ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందక మునుపే, కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం లేదా ఎన్నికల పొత్తుల కోసం ఒత్తిడి చేయవవచ్చును.
ఒకవేళ తెరాస విలీనానికి లేదా పొత్తులకి అంగీకరించకపోయినట్లయితే, తెలంగాణా బిల్లును రాష్ట్రపతి వద్ద త్రోక్కిపెట్టించో లేకపోతే బీజేపీని రెచ్చగొట్టి బిల్లుకి మద్దతు ఈయకుండా చేసి నెపం దానిమీద పెట్టో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదింపజేయకుండా తప్పుకొని, సీమాంధ్రలో తన రహస్య మిత్రులను గెలిపించుకొనే ప్రయత్నం చేయవచ్చును. తద్వారా కొంత మేరయినా నష్టం తగ్గించుకోగలదు.