బిల్లుని తిప్పి పంపేయమని కోరిన ముఖ్యమంత్రి
posted on Jan 25, 2014 @ 2:37PM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ నిన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తెలంగాణా బిల్లును వీలయినంత త్వరగా చర్చ ముగించి వెనక్కి పంపాలని కోరినట్లు చెప్పారు. బహుశః అందుకేనేమో, ఈరోజు శాసనసభలో తెలంగాణా బిల్లుపై చర్చలో మాట్లాడుతూ లోపభూయిష్టమయిన టీ-బిల్లుని, దానిని ఆవిధంగా రూపొందించిన హోంశాఖను, కేంద్రాన్ని, చివరికి తన అధిష్టానాన్ని కూడా తూర్పార బట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇటువంటి తప్పుల తడక బిల్లుపై ఇంకా సభలో చర్చఅవసరం లేదని దానిని వెంటనే వెనక్కి త్రిప్పిపంపమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు నోటీసు ద్వారా కోరారు.
ఆ తరువాత మాట్లాడిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన తరువాత ఆయన కూడా ఇటువంటి లోపభూయిష్టమయిన బిల్లుపై చర్చించవలసిన అవసరం లేదని వెంటనే త్రిప్పి పంపమని స్పీకర్ ను కోరారు. అదేవిధంగా శాసనమండలిలో మంత్రి సి.రామచంద్రయ్య కూడా సరిగ్గా ఇదే కారణాలతో బిల్లును వెనక్కి త్రిప్పిపంపాలని మండలి చైర్మన్ చక్రపాణికి నోటీసులు ఇచ్చారు.
ఒకవైపు బిల్లుపై చర్చ జరగడానికి ఇంకా గడువు కావాలంటూనే, ఏవో కారణాలు చెప్పి బిల్లుని గడువు కంటే ముందే వెనక్కి త్రిప్పిపంపేయాలని కోరడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ గమ్మతయిన విషయం ఏమిటంటే, బిల్లుని ఎంత త్వరగా వెనక్కి పంపుదామా అని ఎదురు చూస్తున్న టీ-కాంగ్రెస్ నేత కే.జానారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రపతి సభలో చర్చించమని పంపిన బిల్లును ఒక ముఖ్యమంత్రో లేక ప్రతిపక్ష నాయకుడో త్రిప్పి పంపమని అడిగే అధికారం ఉందా? తెలుపమని స్పీకర్ ని కోరారు. ఆయన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ, మనం ఎవరికీ బానిసలు కామని, సభ్యులందరికీ స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని అన్నారు. బిల్లు లోపభూయిష్టంగా ఉన్నట్లయితే త్రిప్పి పంపమని అడిగే హక్కు ఉంటుందని ఆయన అన్నారు
రాష్ట్ర విభజన బిల్లును వెనక్కి త్రిప్పి పంపాలని స్పీకర్ కి నోటీసులిచ్చిన ముఖ్యమంత్రి బిల్లుని ఏకమొత్తంగా తిరస్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి హోదాలో ఒక తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు తాజా సమాచారం. ఆవిధంగా చేయడం ద్వారా అధిష్టానం ఆదేశాల మేరకు బిల్లుని వీలయినంత త్వరగా వెనక్కి త్రిప్పి పంపుతున్నపటికీ, తనపై ఎటువంటి నింద పడకుండా, తాను బిల్లును గట్టిగా వ్యతిరేఖిస్తున్నట్లు చెప్పుకొనే సౌలభ్యం కూడా ఆయనకి ఉంటుంది. బిల్లుని తిరస్కరిస్తూ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, దానిపై తెలంగాణా సభ్యులందరూ ఆయనపై చెలరేగిపోవడం ఖాయం గనుక అది కూడా ఆయనకు సీమాంధ్రలో సానుభూతిని సంపాదించి పెడుతుంది.
అదేవిధంగా తెలంగాణా సభ్యులందరూ ఆయన పెట్టబోయే తీర్మాన్నాన్ని, ఆయనని ఎంతగా విమర్శించినప్పటికీ, ఆ తీర్మానం వలననే బిల్లు గడువు కంటే ముందుగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందని తెలుసు గనుక ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండరు.