జగనన్న దెబ్బకు పెట్టుబడులు బంద్.. 4 నుంచి 13వ స్థానానికి ఏపీ డమాల్
posted on Sep 3, 2021 @ 1:00PM
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వేత్తలు హడిలిపోతున్నారా? రాయితీలు ఇస్తామంటున్నా మీకో దండం అంటూ ముఖం చాటేస్తున్నారా? అంటే కేంద్ర సర్కార్ లెక్కలు అవుననే చెబుతున్నాయి. ఏపీకి గత రెండేండ్లుగా కొత్త పెట్టుబడులు అనుకున్నంతగా రావడం లేదు. అసలు ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇందుకు జగన్ సర్కార్ విధానాలే కారణమంటున్నారు. ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందేమోనన్న అసూయతో.. గత ప్రభుత్వంలో ఏర్పాటైన పరిశ్రమలను టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖలో పెట్టుబడులకు గతంలో ముందుకు వచ్చిన లులూ గ్రూప్ అలానే వెనక్కి వెళ్లిపోయిందనే విమర్శలు వచ్చాయి. లులూతో పాటు పలు దిగ్గజ సంస్థలు ఏపీకి గుడ్ బై చెప్పేశాయి. అనంతపురంలో ఏర్పాటైన ప్రతిష్టాత్మక కియా సంస్థ ప్రతినిధులను స్థానిక వైసీపీ ఎంపీ బెదిరించడం పారిశ్రామిక వర్గాలను షాక్ కు గురి చేసింది. అందుకే జగన్ రెడ్డి ప్రభుత్వం పేరు చెబితేనే వ్యాపార వేత్తలు పరార్ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
జగన్ రెడ్డి సర్కార్ తీరుతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని, పెట్టుబడులు రావడం లేదని విపక్షాలు ఆరోపిస్తుండగా.. మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం అలాంటిదేమి లేదని చెబుతూ వస్తున్నారు. గతంలో కంటే ఏపీకి పెట్టుబడులు పెరిగాయని అంటున్నారు. కాని జగన్ పాలనలో ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దారుణంగా పడిపోయాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ద్వారా స్పష్టమైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి గురువారం రాత్రి కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం..2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ వరకు ఏపీకి కేవలం రూ.2,577.1 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. విదేశీ పెట్టుబడుల విషయంలో దేశంలో 13 వ స్థానానికి పడిపోయింది ఏపీ. చంద్రబాబు హయాంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో టాప్ 4లో కొనసాగింది ఆంధ్రప్రదేశ్.
కేంద్ర లెక్కల ప్రకారం విదేశీ పెట్టుబడుల ద్వారా తెలంగాణకు రూ.17,709.15 కోట్లు వచ్చాయి. ఏపీ కంటే తెలంగాణకు ఏకంగా 8 రెట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇక టాప్ 3లో చోటు దక్కించుకున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటక రూ.1,49, 715.38 కోట్లను సాధించింది. రాజకీయంగా అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ.. కర్ణాటక సత్తా చాటింది.రూ.30,078.87 కోట్ట మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సాధించి తమిళనాడు ఐదో స్థానంలో నిలిచింది. అటు జయలలిత, ఇటు కరుణానిధి మరణం తర్వాత తమిళనాడులోనూ రాజకీయ అస్థిరత్వమే రాజ్యమేలుతోంది. అయినా కూడా ఆ రాష్ట్రం కూడా సత్తా చాటింది. ఏపీలో 51 మంది ఎమ్మెల్యేలతో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినీ కూడా జగన్ సర్కార్ పెట్టుబడులు తీసుకురాలేకపోయింది. వైసీపీ సర్కార్ విధానాలే ఇందుకు కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరుల్లో బాగానే ఉండేది. ఉమ్మడి ఏపీకి రాబడిలో ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచే వచ్చేంది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ కేపిటల్‌గా ఏర్పడ్డ కొత్త రాష్ట్రం తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. కనీసం రాజధాని కూడా లేకుండా కొత్త ప్రస్థానం మొదలెట్టిన ఏపీ తీవ్ర కష్టాలు వచ్చాయి. అప్పుల్లో కూరుపోయిన ఏపీని గట్టెక్కించేందుకు టీడీపీ ప్రభుత్వం ఎంతో శ్రమించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీని అగ్రస్థానంలో నిలిపారు చంద్రబాబు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాన్ని టాప్ 4లో కొనసాగేలా చేశారు. అయితే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ కు జనం ఓటేశారు. అయితే తనను గెలిపించిన ప్రజల ఆశలను అడియాశలు చేస్తూ రాష్ట్రాన్ని జగన్ అధోఃగతి బాట పట్టించేశారు.
ఏ రాష్ట్రం, దేశమైనా తనకు వచ్చే రాబడిని పెంచుకునే దిశగానే ఆలోచన చేస్తాయి. ఆదాయం పెంపునకు చర్యలు తీసుకుంటాయి. కాని జగన్ జమానా ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. సంక్షేమ పథకాల పేరుతో అడ్డగోలుగా పంచుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఓ వైపు ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నా.. జగన్ పట్టించుకోలేదు. రాష్ట్ర ఆదాయానికి మించి నాలుగైదు రెట్ల నిధులు అవసరమయ్యే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. వాటి అమలు కోసం అప్పుల మీద పడ్డారు. కొత్త రుణాల కోసం నిత్యం పాకులాడున్నారు. అప్పుల కోసం వెతుక్కోవడానికే టైం సరిపోతుంటే.. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై దృష్టి సారించే అవకాశం ఎక్కడిదనే విమర్శలు వస్తున్నాయి.ఈ కారణంగానే చంద్రబాబు హయాంలో అభివృద్ధి బాటలో దూసుకుపోయిన నవ్యాంధ్ర జగన్ జమానాలో తిరోగమన దిశగా పయనిస్తోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన నివేదికపై స్పంందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖం చూసి, మంత్రి గౌతమ్ రెడ్డి మాయ మాటలు విని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వారెవ్వరూ లేరని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. చంద్రబాబు మెట్టు మెట్టు పేర్చుకుంటూ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడి మరీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీని మొదటి 5 స్థానాల్లో నిలుపుతూ వచ్చారన్నారు. జగన్ రెడ్డి దరిద్ర పాదానికి అరాచకం తోడయ్యి ఇప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో మనం 13వ స్థానంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. పక్కన రాష్ట్రాలన్నీ, ఉన్నతస్థానంలోకి చేరుతుంటే...ఏపీ మాత్రం దిగజారిపోతోందని లోకేష్ అన్నారు.