మధుసూదనాచారిని సీఎం పక్కన పెట్టేశారా? హుజురాబాద్ సభే కారణమా? 

తెలంగాణ తొలి సభాపతిగా శాసనసభ రికార్డులకెక్కిన సిరికొండ మధుసూదనాచారి తన పనితీరుతో అప్పట్లో ప్రజల్లో మంచి మార్కులే కొట్టేశారు. స్పీకర్ గా ఉన్నా కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడానికి, స్థానిక సమస్యల మీద ఎంతోకొంత శ్రద్ధ చూపించేవారని చెప్పుకుంటారు. అయితే స్పీకర్ కు ఉండే పరిమితుల కారణంగా రెగ్యులర్ పొలిటికల్ లీడర్ల మాదిరిగా గతంలోలాగా కలివిడిగా తిరిగే సౌలభ్యాన్ని ఆచారి కోల్పోయారు.  దీంతో ఆయన అనేక అంశాల మీద కొడుకుల మీదనే ఆధారపడాల్సి వచ్చింది. వారికే నియోజకవర్గ యోగ క్షేమాలు, ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యతలు అప్పగించారు. అయితే తండ్రి నుంచి బాధ్యతలు తీసుకున్న ఆచారి కొడుకులు మాత్రం బాధ్యతలకు బదులు "బరువు" పెంచుకునే కార్యక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల 2018 ఎన్నికల్లో తండ్రి ఓటమికి వారే పరోక్షంగా కారణమయ్యారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ క్రమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఓ వెలుగు వెలిగిన సిరికొండ... కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా తన సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా ఆడతారా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆయన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే పక్కన పెట్టేశారన్న వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీని గురించే ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో విపరీతమైన చర్చ నడుస్తోంది. 

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, ఉద్యమ సహచరుడు అయిన సిరికొండను కేసీఆర్ అకస్మాత్తుగా ఎందుకు పక్కన పెట్టేశారన్న చర్చ సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుకుంటున్న కేసీఆర్... తనకు ఎంతో పనికొచ్చే సిరికొండను ఈ టైమ్ లో ఎందుకని పక్కన పెట్టారో లోతుగా ఆరా తీస్తున్నారు. సిరికొండను  పక్కనపెట్టడానికి  పునాదులు ఎక్కడ పడ్డాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

బీసీ వర్గానికి చెందిన విశ్వబ్రాహ్మణులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1న దానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆ సభకు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, బీసీ మినిస్టర్ గంగుల కమలాకర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీ కవితను కూడా ఆహ్వానించారు. ఆ తేదీని కూడా ప్రభుత్వ పెద్దల అనుమతితోనే ఖరారు చేసుకున్నారు. అటు హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం కూడా విశ్వబ్రాహ్మల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించింది. అయితే 2వ తేదీనే ఢిల్లీ టూర్ ఉన్న కారణంగా ఆ తేదీని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ప్రభుత్వ పెద్దల సూచనతోనే మళ్లీ 5వ తేదీని ఖరారు చేశారు. అటు సభా ఏర్పాట్లు కూడా అదే ప్రకారం మొదలుపెట్టుకున్నారు. మరోవైపు విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి హైప్రొఫైల్ కలిగిన వ్యక్తి అయిన మధుసూదనాచారిని సభకు ఆహ్వానించాలని వెళ్లిన విశ్వబ్రాహ్మణ పెద్దలకు చేదు అనుభవం ఎదురైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ బహిరంగ సభ జరగడానికి వీల్లేదని, ఆ సభ జరిగితే తనకు రావాల్సిన క్రెడిట్ రాకుండా పోతుందని, కాబట్టి సభను తరువాత జరుపుకోవాలంటూ సిరికొండ విపరీతమైన అసహనానికి గురై మాట్లాడినట్లు సంఘ నాయకులు చెబుతున్నారు. గత మార్చిలో విశ్వబ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అలా ప్రజల చేత ఎన్నికైన సంఘంగా, ప్రజల చేత ఎన్నికైన అధ్యక్షునిగా ఎర్రోజు భిక్షపతికి ప్రభుత్వం దగ్గర గుర్తింపు లభించింది. కేటీఆర్, హరీశ్ రావు సూచనతోనే ఖరారైన 5వ తేదీ బహిరంగ సభకు హాజరయ్యేది లేదని సిరికొండ తేల్చేయడంతో పాటు అసలు సభ జరగకుండా వీలైనన్ని కుయుక్తులు పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అన్ని ఇతర బీసీ కులాల్లాగే విశ్వబ్రాహ్మణులకు కూడా ప్రత్యేకమైన ఆత్మగౌరవ భవనంతో పాటు దాని నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు విడుదల చేయడానికి సర్కారు నాలుగేళ్ల క్రితమే అంగీకరించింది. ఉప్పల్ భగాయత్ లో ఐదెకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ హామీని పూర్తి చేయాలన్న డిమాండ్ ను చాలా కాలంగా విశ్వబ్రాహ్మణులు వినిపిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల దరిమిలా టీఆర్ఎస్ పెద్దలు అన్ని సామాజికవర్గాల మద్దతూ కూడగడుతున్న సందర్భంలో సొంత కులస్తుల దగ్గరే ఆచారి పలుచనైపోయారని, కేవలం కొందరు వ్యక్తుల మెప్పు కోసం, దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత సంఘం నాయకత్వాన్ని ఏదో స్థాయిలో కొనసాగించడం కోసం వారితో కుమ్మక్కయి అసలు సొంత వర్గ ప్రజలకే దూరమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే 5వ తేదీన జరిగిన బహిరంగ సభకు ప్రభుత్వం తరఫున బీసీ మంత్రి గంగుల కమలాకర్ ను పంపించి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తాము శాయశక్తులా కృషి చేస్తామన్న మెస్సేజ్ ఇప్పించడం గమనార్హం. సభకు హాజరైన గంగుల... తాను మంత్రి హరీశ్ రావు చెబితే సభకు వచ్చానని, ఆయన చెప్పినట్లుగా విశ్వబ్రాహ్మణులకు ఐదెకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు పేర్కొందంటూ చెప్పి... ఆ ఉత్తర్వుల తాజా కాపీని భిక్షపతికి అప్పగించారు. కమలాకర్ మాటలతో సభికులంతా ఈలలు, కేరింతలతో భారీ స్థాయిలో రెస్పాండయ్యారు. 

తనకు దక్కని క్రెడిట్ మరొకరికి దక్కడం జీర్ణించుకోలేని కొందరు పెద్దలు... ఈ సభను వాయిదా వేయడానికి శతవిధాలా ప్రయత్నించారని, అలాంటి నాయకుల లోగుట్లేంటో ప్రజలంతా గ్రహించాలని, ప్రభుత్వం వెన్నుదన్నుతో ముందుముందు కూడా విశ్వబ్రాహ్మణుల మేలు కోసం పని చేస్తానని ఎర్రోజు భిక్షపతి ఇండైరెక్టుగా సిరికొండ మీద అస్త్రాలు సంధించారు. దీంతో విశ్వబ్రాహ్మణ ప్రజానీకంతో ఎక్కడా సంబంధం లేని పాత సంఘం నాయకుల కోసం... ఆ వర్గం యావత్ ప్రజానీకానికి దూరమైన వ్యక్తిగా సిరికొండను ప్రభుత్వం గుర్తించినట్లయింది. హుజూరాబాద్ లో ఈటల మీద గెలుపు కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్న సర్కారుకు చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన సమయంలో సొంత కులం ప్రజల ఓట్లను టీఆర్ఎస్ కు మళ్లించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి.. అసలు సొంత జాతి నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తాము మద్దతిస్తున్న సంకేతాలు వెళితే మొదటికే మోసం వస్తుందన్న అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పసిగట్టినట్లు పక్కా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా సేకరించిన కేటీఆర్ తదితరులు సిరికొండతో సంబంధం లేకుండా బహిరంగ సభకు ప్రభుత్వం తరఫున గంగుల కమలాకర్ ను పంపించడమే సిరికొండ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరి తన రాజకీయ భవితవ్యాన్ని తానే ప్రశ్నార్థకం చేసుకున్న మధుసూదనాచారి స్వయంకృతాపరాధాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

Advertising
Advertising