ముగ్గురు మంత్రులకు బద్వేలు బాధ్యతలు.. జగన్ కు ఓటమి భయమా?
posted on Sep 30, 2021 @ 6:30PM
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార పార్టీని కలవరపెడుతోందా? సీఎం జగన్ సొంత జిల్లా అయిన వైసీపీలో టెన్షన్ కనిపిస్తోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బద్వేలు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతోనే సీఎం జగన్ రివ్యూ నిర్వహించడం ఇందుకు బలాన్నిస్తోంది. అంతేకాదు ఏకంగా ముగ్గురు మంత్రులను బద్వేలు ఎన్నికల బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా నేతలతో పాటు ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలను ఇంచార్జులుగా నియమించారంటే... వైసీపీకి ఓటమి భయం ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
బద్వేలు ఉప ఎన్నికపై గురువారం సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారని ప్రకటించారు. 2019లో కంటే అత్యధిక మెజారిటీతో దాసరి సుధను గెలిపించాలని పిలుపునిచ్చారు. బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఇన్చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. పెద్దిరెడ్డితో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా మంత్రి అంజాద్ బాషాలను ఇంచార్జులుగా నియమించారు. ఇద్దరు ఎంపీలకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించారు. కడప జిల్లా నేతలంతా బద్వేలులో ఉండేలా సీఎం జగన్ ప్రణాళిక రచించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మేళ్లను ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుని పోవాలని బద్వేలు స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.
ఉప ఎన్నిక అనగానే వైసీపీలో ఏ మూలనో టెన్షన్ టెన్షన్ కనిపిస్తోంది. గెలుస్తామనే నమ్మకం ఉన్నా.. ఏదో గెలిచాం చాలన్నట్టు.. గెలిచి ఓడినంత పని అవుతోంది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. రెండు లక్షల మెజార్టీతో గెలిచామని విర్రవీగే పరిస్థితి లేకుండా పోయింది. ఎలక్షన్‌కు ముందు 6 లక్షల మెజార్టీ వస్తుందని మంత్రులు ఫోజులు కొట్టారు. ప్రచారం మొదలయ్యేసరికి ఆ ఫిగర్ తగ్గుకుంటూ పోయింది. 4 లక్షల ఆధిక్యం పక్కా అన్నారు. ఓ దశలో వైసీపీకి ఓడిపోతామేమోననే వణుకు మొదలైంది. అందుకే కాబోలు.. ఓడితే పరువంతా పోతుందనే భయంతో.. పోలింగ్ నాడు పక్క జిల్లాల నుంచి బస్సుల్లో జనాలను తీసుకొచ్చి మరీ దొంగఓట్లతో గట్టేక్కారు. వైసీపీకి ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు దక్కవనే బెదిరింపులు, వాలంటీర్లతో వార్నింగులు, తాయిలాలు, పందేరాలు.. ఇలా తిరుపతిలో గెలుపు కోసం వైసీపీ చేయని కుట్ర, కుతంత్రాలు లేవు. అన్ని చేసినా.. 6 లక్షల మెజార్టీ అని గొప్పలు చెప్పినా.. చివరాఖరికి 2 లక్షల మెజార్టీతో బయటపడ్డారు. గెలిచి ఓడారు. ఆ ఎన్నిక సజావుగా జరిగుంటే టీడీపీనే గెలిచుండేదని అంతా అన్నారు.
తిరుపతి జ్ఞాపకం మరవక ముందే కడప బద్వేలు ఉప ఎన్నిక వచ్చేసింది. సొంత జిల్లాలో వైసీపీకి గట్టి పట్టున్న మాట వాస్తవమే. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయారనే సానుభూతి అదనపు బలం. అయినా, ఈజీగా గెలుస్తామనే ధీమా మాత్రం అధికారపార్టీలో కనిపించడం లేదు. వైసీపీపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహమే ఆ పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది. అసలే రాయలసీమ. ఉపాధి అంతంత మాత్రమే. ఇసుక పాలసీ అంటూ ఇసుక దొరక్కుండా చేసి రోజు కూలీలకు ఉపాధి లేకుండా చేసిన ఘనత జగన్‌దే. ఇక ధరల పెంపు, చెత్త పన్నులు, అప్పులు, జీతాలు సమయానికి రాకపోవడం.. ఇలా ప్రతీ ఒక్క వర్గమూ జగన్ పాలనపై ఆగ్రహంగానే ఉంది. ఇక మద్యం తాగే అలవాటున్న ప్రతీఒక్కరు.. మందు తాగే ప్రతీసారి.. జగన్‌ను తిట్టకుండా ఉండటం లేదు. అడ్డగోలుగా ధరలు పెంచేసి.. అడ్డమైన బ్రాండ్లు తీసుకొచ్చి.. మందుబాబుల పాలిట విలన్ అయ్యారు జగన్.
ఇలా ప్రజాగ్ని ఉప ఎన్నిక వచ్చినప్పుడే బయటపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేయలేము. దుబ్బాకలో టీఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు షాక్ ఇచ్చినట్టు.. బద్వేలులో వైసీపీకి బుద్దిచెప్పి జగన్‌కు ఝలక్ ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అధికార పార్టీలో టెన్షన్ నెలకొందని అంటున్నారు. ఆ భయంతోనే సీఎం జగనే స్వయంగా రంగంలోకి దిగారంటున్నారు. సొంత జిల్లా, ఎమ్మెల్యే చనిపోయిన సానుభూతి ఉన్నా... ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి గంటల పాటు చర్చించారంటేనే ఎంత భయం ఉందో అర్ధం అవుతుందని అంటున్నారు. అందుకే ఏకంగా ముగ్గురు మంత్రులను ఇంచార్జులుగా నియమించారని చెబుతున్నారు. ముందు ముందు మరికొందరు మంత్రులను అక్కడే మోహరించే అవకాశాలు కన్పిస్తున్నాయి.