సేమ్ సెక్స్ మ్యారేజెస్ కి గ్రీన్ సిగ్నల్.. పిల్లల్ని కూడా
posted on Sep 30, 2021 @ 6:16PM
హవ్వ.. ఇంత చోద్యమా.. ఎక్కడైనా కన్నామా, విన్నామా.. అనుకొని నోరెళ్లబెట్టాల్సిన పన్లేదు. నిర్ణయం జరిగిపోయింది. లా మేకర్స్ ఓటేశారు. చట్టసభ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక అమలు మాత్రమే మిగిలింది. జులై 2022 నుంచి ఆ ముచ్చట కూడా తీరబోతోంది. చాటుమాటుగా స్వలింగ సంపర్కం చేసుకునేవారు, విడదీయలేని ఫ్రెండ్షిప్ పేరుతో పెళ్లికి దూరంగా ఉంటూ అసలు విషయం దాచిపెడుతూ ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఇకపై లేదన్నమాట.
స్విట్జర్లాండ్ పార్లమెంట్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సేమ్ సెక్స్ పర్సన్స్ మధ్య పెళ్లిళ్ల వరకు ఓకే కానీ పిల్లల సంగతేంటన్న ప్రశ్న రావచ్చు. అయితే స్వలింగ సంపర్కీయులకు పిల్లల్ని కనే అవకాశం లేదు కాబట్టి వారు కావాలంటే పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. దీనికి స్విట్జర్లాండ్ తాజా చట్టంలో ఆమోదముద్ర తెలిపింది.
అయితే మామూలుగానే స్విట్జర్లాండ్ లోని రైట్ వింగ్ యాక్టివిస్టులు, సంప్రదాయవాదులు, చర్చి వర్గాలు మొదట్నుంచీ సేమ్ సెక్స్ మ్యారేజ్ ని వ్యతిరేకిస్తున్నాయి. తాజా నిర్ణయంపైనా వారు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా చట్టంతో దేశంలోని పిల్లలు, తండ్రులు ఓటమిపాలయ్యారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎల్జీబీటీ క్యాంపెయినర్స్, హక్కుల సంఘాలు దీన్నో మైల్ స్టోన్ గా అభివర్ణిస్తున్నాయి. ఇకపై ఎల్జీబీటీ లు అందరూ స్వాభిమానంతో, ఆత్మగౌరవంతో తలెత్తుకోగలరని వారంటున్నారు.
సేమ్ సెక్స్ మ్యారేజెస్ కోసం స్విట్జర్లాండ్ లో 2007 నుంచి ఓ పెద్ద ఉద్యమమే నడుస్తోంది. 2013లో దీన్ని లీగలైజ్ చేయాలని పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు గత డిసెంబర్లోనే పాసైంది. అయితే ప్రతిపక్షాలు, రైట్ వింగ్ యాక్టివిస్టులు, చర్చి సంఘాలు వంటి ఆర్గనైజేషన్స్ అడ్డుకుంటూ వస్తున్నాయి. దీనికోసం రెఫరెండం నిర్వహించాలని పట్టుబట్టాయి. దీంతో ఆదివారం రెఫరెండం నిర్వహించారు. ఇందులో పెద్దఎత్తున ప్రజలు, సంఘాలు పాల్గొన్నారు. ఈ రెఫరెండంలో సేమ్ సెక్స్ మ్యారేజ్ కి అనూహ్యమైన మద్దతు లభించింది. ఫలితంగా సేమ్ సెక్స్ మ్యారేజ్ కి గల ఆఖరి అడ్డంకి కూడా తొలగిపోయినట్లయింది. వచ్చే జులై నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఆ కపుల్స్ పిల్లల్ని దత్తత తీసుకునే వెసులుబాటు కూడా లభిస్తోంది. ప్రపంచంలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 30 వ దేశంగా స్విట్జర్లాండ్ నమోదైంది.