రాజమండ్రి చేప ధర రూ. 2 లక్షల 60 వేలు.. కిచిడి చేప స్పెషల్ ఏంటో తెలుసా?
posted on Oct 31, 2021 @ 4:17PM
సాధారణంగా మనం మార్కెట్ లో లభించే చేపల ధరలు వంద నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి. పులస చేప అయితే రూ. 4వేలు ఉంటుంది. కానీ ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన కిచిడి అనే చేప ఏకంగా రూ. 2 లక్షల 60 వేల ధర పలికింది. తూర్పు గోదావరి జిల్లా, సకినేటిపల్లి మండలం, అంతర్వేది చేపల మార్కెట్‌లో కనిపించిన ఆ చేప చాలా స్పెషల్ అట. అందుకే దానికి అంత రేట్ పలికిందని అంటున్నారు.
మత్స్యకారుడికి దొరికిన ఆ చేప కిచిడి చేప. దానిలో ఔషధ గుణాలుండడమే అంత ధర పలకడానికి అసలు కారణంగా తెలిసింది. అంతర్వేది సాగర సంగమం వద్ద స్థానిక మత్స్యకారులు వేటకు వెళ్లగా 21 కిలోల చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దాన్ని మార్కెట్‌లో విక్రయించగా రూ. 2 లక్షల 60వేల ధర పలికింది. ఈ చేప పొట్ట భాగాన్ని ఆపరేషన్లలో కుట్లు వేయడానికి వాడే దారం తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు ఆపరేషన్లలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారని స్థానికులు చెబుతున్నారు. దీన్ని చైనాకు ఎగుమతి చేయనున్నట్లు కొనుగోలు దారులు తెలిపారు. అందుకే అంతర్వేది చేపల మార్కెట్‌లో కిచిడి చేప అధిక ధర పలికి అందరినీ ఆశ్చర్చానికి గురిచేసింది.