పెగాసస్ తీగలాగితే కర్ణాటకం డొంక కదిలింది ..
posted on Jul 21, 2021 @ 12:49PM
తీగ లాగితే డొంకంతా కదిలిందంటే ఇదే నేమో... ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ వ్యవహారంతో అనేక పాత కథలను కొత్తగా తెరమీదకు వస్తున్నాయి. రెండేళ్ళ క్రితం 2019 లో కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది మ్మెల్యేలు నాటకీయ పరిణామాల మధ్య రాజీనామా చేయడంతో, ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం, బలపరీక్షలో బాల్చి తన్నేసింది.అయితే, అప్పట్లో ప్రభుత్వం కూలిపోవడానికి సంకీర్ణ భాగస్వామ్య పార్టీల మధ్య సయోధ్యత లేకపోవడమే కారణమని అందరూ అనుకున్నారు. ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమార స్వామి మిత్ర పక్షంమే (కాంగ్రెస్) కొమ్పకుల్చిందని వాపోయారు. కాంగ్రెస్ పెడుతున్న కష్టాలు భరించలేక పోతున్నానంటూ ఒకటి రెండు సార్లు పుబ్లిక్’లో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వంటి పెద్దలు, ముఖ్యమంత్రి కుమార స్వామి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వక పోవడం వల్లనే ప్రభుత్వం పతనమైందని అన్నారు. ఇలా సంకీర్ణ భాగస్వామ్య పార్టీలు పరస్పరం ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నాయి.
అయితే, ఇప్పుడు పెగాసస్ స్పైవైర్’ తో పాటుగా ఫోన్ ట్యాపింగ్ ఉదంతం బయటకు రావడంతో, 2019లో కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్’ను ఉపయోగించిందని కాంగ్రెస్, ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీ ‘పెగసాస్’ను ప్రయోగించి కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వేసిందని ఆరోపించారు.మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరతో పాటు సిద్ధరామయ్య వ్యక్తిగత కార్యదర్శి వెంకటేష్ ఫోన్ నెంబర్’ ను హ్యాక్ చేశారని సిద్దరామయ్య ఆరోపించారు.
అందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఒక్కసారి గతంలోకి వెళితే, 2019 జూలైలో 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారంతా బీజేపీలో చేరారు. ఈవ్యవహారం మొత్తం బహిరంగంగానే జరిగింది. ఉభయ వర్గాలు క్యాంపులు నిర్వహించాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగానే ఆరోపణలు చేసుకున్నారు. కోర్టులకు వెళ్లారు. తీర్పులు వచ్చాయి. చివరకు సభలో బలపరీక్ష మీద సుదీర్ఘంగా రోజుల తరబడి చర్చజరిగింది. చివరాఖరులో బలపరీక్షలో ఓడిపోయినా తర్వాతనే ముఖ్యమంత్రి కుమార స్వామి రాజీనామా చేశారు. ఈవ్యవహారం మొత్తం టీవీలలో ప్రత్యక్ష ప్రసారం కూడా అయింది. అందరూ చూస్తుండగానే, కుమార స్వామి రాజీనామా ప్రకటన చేశారు. అప్పుడు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంచీలు చరిచి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం కూడా టీవీలలో కనిపించింది.
అయితే, కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేత సిద్దరామయ్య ఇప్పడు ఈ వ్యవహారం అంతా, కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ద్వారానే నడిపించిందని అటున్నారు.ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రదాని మోడీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కిందని,అప్రజాస్వామికంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని సిద్దరామయ్య ఆరోపించారు.
ఇక మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో ప్రభుత్వాలను కూల్చేందుకు కూడా ఈ పెగాసస్’నే ప్రయోగించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.పార్లమెంట్ ఉభయసభల్లో ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడు,కర్ణాటక కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే అయితే ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జుడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, జేడీఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మాత్రం.సుదికోసం సోదికెళితే పాత రంకులన్నీ బయట పడ్డాయని అన్నట్లు అవుతుందని అనుకున్నారో ఏమో కానీ, గతం గతః ..ఇప్పుడు అదెందుకు, అంటున్నారు.