పెరగనున్న వరదలు.. తగ్గనున్న పంటలు.. ప్రమాదపుటంచున ప్రపంచం
posted on Oct 29, 2021 @ 9:05PM
విధాన నిర్ణేతలందరూ రాజకీయ నాటకాలు రక్తి కట్టించడంలో తలమునకలై ఉండగా... ప్రకోపిస్తున్న ప్రకృతి తన ధ్వంస రచనలో బిజీగా ఉంది. ఎన్నికైన ఐదేళ్ల కాలంలో ప్రజా భద్రతను, సంక్షేమాన్ని మరింత సురక్షితం చేసేందుకు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన శాసనకర్తలు ఫక్తు రాజకీయ పందేరాలకే పరిమితమైపోతున్నారు. ఫలితంగా వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎర్త్ పొల్యూషన్ అంతకంతకూ పెరిగిపోతూ ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఉదాహరణకు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోనే వరదల సమస్య నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. మూసీ ఉప్పొంగినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం, ఆ తరువాత ఆ విషయాన్ని అటకెక్కించడం ఆనవాయితీగా మారింది. రాజకీయ నాయకుల, ఆయా ప్రభుత్వాల వైఖరి కారణంగానే ఈ ప్రపంచం సమీప భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోబోతోందని పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, మానవ సమాజ క్షేమాన్ని కాంక్షించే పలు దేశాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఇండియాలో మాత్రం రాజకీయ పదవులు కాపాడుకోవడం చుట్టూనే కాలమంతా గడిచిపోతోందన్న అసంతృప్తి క్రమక్రమంగా పెరుగుతోంది.
మరికొన్ని గంటల్లో రోమ్ లో జరిగే 16వ జి-20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్న తరుణంలో... గ్లోబల్ వార్మింగ్ పై ఐరాస ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా నివేదిక విడుదల చేసింది. 40 మంది పర్యావరణవేత్తలు గ్లోబల్ వార్మింగ్ పై అధ్యయనం చేసి ఆ రిపోర్టును విడుదల చేశారు.
ఆ రిపోర్టులో ముఖ్యంగా భారత్ అప్రమత్తం కాకపోతే తలెత్తే ఉపద్రవాలపై కూలంకషంగా చర్చించారు. రాబోయే 15-20 ఏళ్లలో ఇదే ప్రకారం 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు భారత్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే వేడిగాలులు, విపరీతమైన వరదలు, పంటల్లో క్షీణత, చేపల ఉత్పత్తిలో తగ్గుదల 25 రెట్లు పెరుగుతుందని హెచ్చరించారు. ఇదే హీట్ వేవ్స్ 2 డిగ్రీలకు పెరిగితే గనక పైన చెప్పుకున్న దుష్పరిణామాలు 5 రెట్లు పెరుగుతాయని... ఒకవేళ కనీసంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినా పైన చెప్పుకున్న ప్రకృతి బీభత్సం ఒకటిన్నర రెట్లకన్నా ఎక్కువ బీభత్సం తలెత్తుతుందని హెచ్చరించారు.
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోటీ 80 లక్షల మంది భారతీయుల జీవితాలు రిస్కులో పడతాయని, ఆ వేడిగాలుల కారణంగా హిమానీనదాాలు పెరగడం, అకాల వర్షాలు, వరద బీభత్సాలకు దారితీస్తుందని రిపోర్టు వెల్లడిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటా ఇండియాలో కోటీ 30 లక్షల మంది నిరాశ్రయులవడమో, నివాసాలు కోల్పోవడమో, సహాయ శిబిరాల్లో తల దాచుకోవడమో, వారిలో కొందరు గల్లంతవడమో జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రాల్లో కూడా గత ఐదారేళ్ల వరదలతో పోలిస్తే వరద బీభత్సాలు గణనీయంగా పెరగడం ఇక్కడి ప్రజలకు అనుభవంలో ఉన్నదేనని గమనించాలి.
అంతేకాదు... అదుపులేని గ్లోబల్ వార్మింగ్ కారణంగా చెరుకు, వరి, గోధుమ పంటలు దారుణంగా పడిపోతాయని, కరువు కాటకాలు విజృంభిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆయా పంటలకు 29 శాతం నీటి డిమాండ్ పెరుగుతుందంటున్నారు. గత 2 దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా వంటి పెద్ద దేశాల్లో దావనలాల తీవ్రత ఎంత పెరిగిపోయిందో కూడా గమనించాలని నిపుణులు అంటున్నారు. పంటల క్షీణత కారణంగా, ఇంకా చెప్పాలంటే వరి, గోధుమ వంటి పంటల ఉత్పత్తి క్షీణించిపోవడం వల్ల భారత్ 2050 నాటికి 81 బిలియన్ యూరోల ఆదాయం కోల్పోతుందని, 15 శాతం రైతుల ఆదాయం దారుణంగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమ్మిట్ కు హాజరవుతున్న ప్రధాని మోడీ ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకొస్తారోనని పలు జీ-20 దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.