Read more!

అహో గురు.. ఒహో శిష్యా..

 

గురు శిష్య బంధం ఏ రంగంలోనైనా కొనసాగుతుంది కానీ రాజకీయాల్లో మాత్రం గురువు గురువే.. శిష్యుడు శిష్యుడే.. రాష్ట్ర విభజనతో ఈ లెక్కలు ఇంకాస్తా ముందుకు వెళ్లి సమూలంగా మారిపోయాయి. ప్రస్తుతం ఎవరు గురువు? ఎవరు శిష్యుడు అనే స్థాయికి దిగజారిపోయాయి బంధాలు. తమ మనుగడ కోసం స్నేహితులు, బంధువులు ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో చేరినట్టే గురుశిష్యులు కూడా చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోయారు. వైఎస్ ఆత్మ కేవీపీ, అంతటి ఆత్మకు అత్యంత ఆప్తుడైన శిష్య పరమాణువు, కరడుగట్టిన కాంగ్రెస్ వాది రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జై సమైక్యాంధ్ర పార్టీలో ఉంటే.. తనకు రాజ్యసభ ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్ లోనే కేవీపీ కొనసాగుతున్నారు.

 

తన రాజకీయ ఆరంగ్రేటానికి సాయం అందించిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ చేయి వదిలి టీడీపీ గూటిలో చేరగా, గురువు బాటలో వెళ్ళలేక డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం హస్తం నీడలో సేదదీరుతున్నాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన నుంచీ చిరంజీవి వెన్నంటి ఉన్న గంటా శ్రీనివాసరావు చిరుతోపాటే కాంగ్రెస్ లో విలీనమైపోయారు. ప్రస్తుతం గురు చిరు కాంగ్రెస్ కాడె భుజానకెత్తుకుంటే..గంటా తెలుగుదేశం లో చేరిపోయారు.

 

కిరణ్ కు అత్యంత సన్నిహితుడని పేరున్న పితాని సత్యనారాయణ.. సీఎం ఎక్కడుంటే అక్కడే.. ఎప్పుడు రాజీనామా చేస్తే అప్పుడే అని వీర విధేయత ప్రదర్శించారు. చివరికి నల్లారి నావ మునిగిపోతుందని గ్రహించి ఒడ్డునే ఉండిపోయారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా రాజకీయ చిత్రం ఒక్కసారిగా అహో గురు.. ఒహో శిష్యా... అనే స్థాయికి చేర్చిన ఘనత మాత్రం కాంగ్రెస్ పార్టీయే దక్కించుకుంది.