విద్యుత్ ఛార్జీలు పెంచడం తప్పే: చిరంజీవి
posted on Jan 10, 2013 @ 7:30PM
ఒకవైపు ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పెంచిన విద్యుత్ చార్జీలమీద వీధులకెక్కి పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరో వైపు తన కాబినెట్ మంత్రులే ఒకరి తరువాత మరొకరు తనని తప్పు పట్టడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దానికి తోడూ పీ.సీ.సీ. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బయట ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నా, తనని కలిసినప్పుడు మాత్రం పుండు మీద కారం చల్లినట్లు ‘ మాకెవరికీ తెలీనీకుండా అట్టాగ మీరొక్కరే ఫైళ్ళమీద సంతకాలు పొడిసేత్తే మరిట్టాగే ఉంటుంది యవ్వారం’ అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటే కిరణ్ కుమారుని పరిస్థితి కక్కలేని, మింగలేని పరిస్థితయింది.
అందరూ ఎవరికీ తోచినది వారు మాట్లాడేస్తుంటే కేంద్ర మంత్రినయి ఉండి తానూ మాట్లాడితే తప్పేమిటి అనుకొన్న చిరంజీవి కూడా తన అనుచరుడు రామచంద్రయ్య చెప్పినట్లు కరెంటు చార్జీలు పెంచితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదన్న అభిప్రాయంతో తానూ కూడా ఏకీభవిస్తునానంటూ పత్రిక వాళ్ళని పిలిచి చెప్పేడు.